భారత్ నమ్మకమైన భాగస్వామి.. అందుకే అన్ని దేశాలు ట్రేడ్ డీల్స్‌‌ చేస్కుంటున్నయ్: మోదీ

భారత్ నమ్మకమైన భాగస్వామి.. అందుకే అన్ని దేశాలు ట్రేడ్ డీల్స్‌‌ చేస్కుంటున్నయ్: మోదీ
  • మలేసియాతో శతాబ్దాల అనుబంధం ఉంది 
  • ఇక్కడ కాన్సులేట్ ఆఫీస్, తిరువళ్లూరు సెంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడి
  • మలేసియా ప్రధానితో కలిసి ఇండియన్ కమ్యూనిటీ ప్రోగ్రామ్‌‌కు హాజరు 

భారత్ నమ్మకమైన భాగస్వామిగా గుర్తింపు పొందిందని, అందుకే అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ తదితర దేశాలు వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయని ప్రధాని మోదీ అన్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శనివారం మలేసియా వెళ్లారు.

కౌలాలంపూర్: ప్రపంచవ్యాప్తంగా భారత్ నమ్మకమైన భాగస్వామిగా గుర్తింపు పొందిందని ప్రధాని మోదీ అన్నారు. అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ తదితర దేశాలతో జరిగిన వాణిజ్య ఒప్పందాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శనివారం మలేసియా చేరుకున్నారు. ఆయనకు కౌలాలంపూర్ ఎయిర్‌‌‌‌పోర్టులో మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇద్దరూ ఒకే కారులో ఇండియన్ కమ్యూనిటీ ప్రోగ్రామ్‌‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచవ్యాప్తంగా భారత్ అంటే నమ్మకం పెరిగింది. 

బ్రిటన్, యూఏఈ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఒమన్, ఈయూ, అమెరికాతో జరిగిన ట్రేడ్ డీల్స్‌‌నే ఇందుకు నిదర్శనం” అని పేర్కొన్నారు. ‘‘మలేసియాలో 30 లక్షల మంది భారత సంతతి ప్రజలు ఉన్నారు. భారత సంతతి ప్రజలు ఉన్న రెండో అతిపెద్ద దేశం ఇదే. వీరిలో ఎక్కువ మంది తమిళులే. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంకు తమిళ పాటలంటే ఇష్టం. ముఖ్యంగా ఎంజీ రాంచంద్రన్ పాటలు బాగా వింటారు. తమిళ భాష ప్రపంచానికి భారత్ ఇచ్చిన గిఫ్ట్. 

తమిళ సంస్కృతీ సంప్రదాయాలు, సాహిత్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. మలేసియాలో ఎన్నో శతాబ్దాలుగా తమిళులు ఉంటున్నారు. అందుకే మలయా యూనివర్సిటీలో తిరువళ్లూరు చైర్ ఏర్పాటు చేశాం. తమిళ వారసత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి తిరువళ్లూరు సెంటర్ ఏర్పాటు చేయనున్నాం. అలాగే కొత్త కాన్సులేట్ ఆఫీసును ప్రారంభిస్తాం. మలేసియా విద్యార్థులు భారత్‌‌లో చదువుకోవడానికి వీలుగా తిరువళ్లూరు స్కాలర్‌‌‌‌షిప్ అందజేస్తాం” అని ప్రకటించారు. ‘‘భారత్, మలేసియా కలసికట్టుగా ముందుకెళ్తాయి. భారత్ అభివృద్ధే మలేసియా అభివృద్ధి.. అది ఆసియా అభివృద్ధి కూడా” అని పేర్కొన్నారు. 

మోదీ.. మంచి దోస్తు: అన్వర్ 

భారత్‌‌, మలేసియా మధ్య పురాతన కాలం నుంచే సంబంధాలు ఉన్నాయని ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం పేర్కొన్నారు. ‘‘భారత్‌‌ మాకు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి. అది కేవలం వస్తువులకే పరిమితం కాదు.. టూరిజం పరంగానూ రెండు దేశాల మధ్య ట్రేడ్ జరుగుతున్నది. 2025లో 15 లక్షల మందికి పైగా ఇండియన్లు మలేసియాలో పర్యటించారు. మోదీ నాకు మంచి దోస్తు. అందుకు చాలా గర్వంగా ఉంది” అని చెప్పారు.

రెడ్ కార్పెట్‌‌తో స్వాగతం.. 

ఇండియన్ కమ్యూనిటీ ప్రోగ్రామ్‌‌కు హాజరైన మోదీ, అన్వర్ ఇబ్రహీంకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. దాదాపు 800 మందికి పైగా కళాకారులు.. భరతనాట్యం, కథక్, కథాకళి, కూచిపూడి, యక్షగానం, లవణి, ఒడిస్సీ తదితర సంప్రదాయ నృత్యప్రదర్శనలు చేశారు. దీనికి మలేసియన్ బుక్‌‌ ఆఫ్‌‌ రికార్డ్స్‌‌లో చోటు దక్కింది. కాగా, అంతకుముందు ఎయిర్‌‌‌‌పోర్టులో ప్రధాని మోదీని మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వయంగా రిసీవ్ చేసుకున్నారు. రెడ్ కార్పెట్‌‌తో స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ ఒకే కారులో ఇండియన్ కమ్యూనిటీ ప్రోగ్రామ్‌‌కు బయలుదేరారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ఆదివారం ఇద్దరు లీడర్లు చర్చలు జరపనున్నారు.