న్యూఢిల్లీ: ఇన్నాళ్లూ భారీ సుంకాలతో ఇబ్బందిపడ్డ మనదేశ ఎగుమతిదారులకు అమెరికా–ఇండియా వాణిజ్య ఒప్పందం బూస్ట్ అని చెప్పవచ్చు. భారతీయ వస్తువులపై సుంకాలను 18 శాతానికి తగ్గించడం వల్ల చాలా రంగాలకు మేలు జరుగుతుంది. ఉదాహరణకు100 డాలర్ల విలువ గల వస్తువుపై 25 శాతం సుంకం ఉంటే, అది దిగుమతి చేసుకున్న వస్తువు ధరను 125 డాలర్లకు పెంచుతుంది. సుంకం 18 శాతానికి తగ్గడం వల్ల ధర118 డాలర్లకు పడిపోతోంది. తక్కువ లాభాలతో పనిచేసే రంగాల్లో 100 డాలర్ల వస్తువులపై ఈ ఏడు డాలర్ల తేడా చాలా కీలకం అవుతుంది. ఎగుమతిదారుల లాభాలు పెరుగుతాయి. ఈ ఒప్పందం వల్ల 2027లో మన జీడీపీ వృద్ధి రేటు 20 నుంచి 40 బేసిస్ పాయింట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. విదేశీ పెట్టుబడులు పెరగడానికి, రూపాయి విలువ స్థిరంగా ఉండటానికి వీలు కలుగుతుంది.
ఎక్కువగా లాభపడే రంగాలు ఇవే..
టైక్స్టైల్స్, దుస్తులు
ఈ ఒప్పందం వల్ల అత్యధికంగా లబ్ధి పొందేది వస్త్ర రంగమే! అమెరికాకు జరిగే వస్త్ర ఎగుమతులపై సుంకాలు తగ్గడం వల్ల భారతీయ కంపెనీలకు బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో పోటీ పడే సామర్థ్యం పెరుగుతుంది. గోకుల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్, వెల్స్పన్ లివింగ్, కేపీఆర్ మిల్ వంటి సంస్థల షేర్లు భారీగా లాభపడతాయి. తక్కువ సుంకాల వల్ల ఈ కంపెనీల లాభాల మార్జిన్ పెరుగుతుంది.
ఆటోమొబైల్స్
అమెరికా ఆటోమొబైల్ కంపెనీలకు భారత్ నుంచి విడిభాగాల సరఫరా మరింత సులభతరం అవుతుంది. భారత్ ఫోర్జ్, సోనా బీఎల్డబ్ల్యూ వంటి కంపెనీలు తమ అమెరికా వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది మంచి అవకాశం. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారయ్యే విడిభాగాలకు అమెరికా మార్కెట్‌లో గిరాకీ
పెరుగుతుంది.
ఫార్మా సెక్టార్
అమెరికాకు జనరిక్ మందులను ఎగుమతి చేసే భారత ఫార్మా కంపెనీలకు ఇది మేలు చేస్తుంది. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, సన్ ఫార్మా వంటి సంస్థలు అమెరికాలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ధరల పరంగా భారతీయ మందులు అక్కడ మరింత పోటీని ఇస్తాయి. అమెరికా మార్కెట్లలో భారత ఫార్మా కంపెనీల మందుల ధరలు తగ్గుతాయి.
రసాయనాలు
చైనాపై ఆధారపడటం తగ్గించాలనుకుంటున్న అమెరికా సంస్థలకు భారత స్పెషాలిటీ కెమికల్ కంపెనీలు ఇప్పుడు ప్రధాన ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఎస్ఆర్ఎఫ్, నవీన్ ఫ్లోరిన్, ఆరతీ ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు ఈ ఒప్పందం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతాయి.
సముద్ర ఉత్పత్తులు
భారత రొయ్యల ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్. సుంకాల తగ్గింపు వల్ల అవంతి ఫీడ్స్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్ వంటి కంపెనీల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా బలాన్ని ఇస్తుంది.రత్నాలు, ఆభరణాలు పాలిష్ చేసిన వజ్రాలు, బంగారు ఆభరణాలతో సహా రత్నాలు, ఆభరణాల ఎగుమతులకు తీవ్రపోటీ ఉంటుంది. సుంకాలు అమెరికా హోల్‌సేలర్లు, రిటైలర్ల రిటైల్ ధరలు, ఇన్వెంటరీ ఖర్చులపై ప్రభావం చూపుతాయి. వీటిని 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం వల్ల భారత ఆభరణాల ఎగుమతుల ధర తగ్గుతుంది. లాభాలపై ఉన్న ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
ఐటీ రంగం
మన ఐటీ రంగానికి అమెరికా అతిపెద్ద మార్కెట్ కాబట్టి ఇండియా ఐటీ రంగం లాభపడుతుంది. అయితే, సాఫ్ట్‌వేర్ ఎగుమతులు సేవల వాణిజ్యం కిందకు వస్తాయి కాబట్టి తక్కువ సుంకాలు వీటిపై నేరుగా ప్రభావం చూపవు. ఒప్పందం వల్ల అమెరికా కంపెనీలు భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహం చూపుతాయి. జీసీసీలు ఏర్పాటు చేసే అమెరికా సంస్థలకు మన దేశం ప్రధాన కేంద్రంగా మారుతుంది.
యూఎస్ వ్యాపారులకూ మేలే..
అమెరికా కంపెనీలు తమ సరఫరా గొలుసు కోసం చైనాపై ఆధారపడటం తగ్గించి భారత్ వైపు మళ్లడానికి ఈ ఒప్పందం గొప్ప అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా రసాయనాలు, ఇంజినీరింగ్ వస్తువుల కోసం భారత్ నమ్మకమైన భాగస్వామిగా మారుతుంది. అమెరికా దిగుమతిదారులు తక్కువ ధరకు వస్తువులను పొందవచ్చు. తమ ఉత్పత్తులను భారత్‌లో సులభంగా విక్రయించడానికి, తమ వ్యాపారాలను విస్తరించడానికి మార్గం సుగమమవుతుంది. ఏఐ, సెమీకండక్టర్లు, రక్షణ రంగాల్లో భారతీయ ప్రతిభను అమెరికా సంస్థలు మరింత సమర్థంగా వాడుకోవచ్చు. భారత్‌లో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల కంపెనీల నిర్వహణ ఖర్చులు తగ్గుతాయి.
