తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో రెండో మ్యాచులో పుంజుకొని ఆడాల్సి ఉంది. కోహ్లీ గైర్హాజరీలో ఎవర్ని ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. కేఎల్ రాహుల్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని సూచించాడు. బాక్సింగ్ డే టెస్టును భారత్ ఫ్రెష్‌గా ఆరంభించాలన్నాడు. పాజిటివ్ దృక్పథంతో ఆడుతూ మిగిలిన సిరీస్‌లో బలంగా స్ట్రాంగ్ బ్యాక్ ఇవ్వగలమనే దీమాతో పోరాడాలన్నారు.
‘మొదటి టెస్టులో భారత్ ఆడిన తీరుకు కోపం రావడం సహజమే. కానీ క్రికెట్‌లో ఏదైనా సాధ్యమేనని అర్థం చేసుకోవాలి. టీమిండియా పాజిటివ్‌గా ఉండాలి లేకపోతే సిరీస్‌ను 4-0తో కోల్పోయినా ఆశ్చర్యమేం లేదు. టీమ్‌లో రెండు మార్పులు చేయడంపై మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టాలి. ఓపెనర్‌గా పృథ్వీ షా స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఆడించాలి. నంబర్ 5 లేదా ఆరో పొజిషన్‌లో శుభ్‌మన్ గిల్‌కు ఛాన్స్ ఇవ్వాలి. అతడి ఫామ్ బాగుంది. ఆటను బాగా ఆరంభిస్తే పరిస్థితులు మారిపోతాయి’ అని గవాస్కర్ చెప్పాడు.

