IND vs BAN : తొలి టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ

IND vs BAN : తొలి టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ

చటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్, భారత్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ లో టీం ఇండియా 188 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 512 పరుగుల భారీ లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన బంగ్లా మొదటి దశలో భారత్ కు గట్టి పోటీ ఇచ్చింది. నాలుగవ రోజు మొదటి సెషల్ లో దాటిగా ఆడుతూ భారత్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టింది. ఒక దశలో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందేమో అన్న సందేహాలు తలెత్తాయి. మొదటి సెషన్ ముగిసే సమయానికి టీం ఇండియా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది.  

అయితే, రెండవ సెషన్ ఆట మొదలు కాగానే బంతిని అందుకున్న ఉమేష్ యాదవ్ భారత్ కు మొదటి వికెట్ అందించాడు. తర్వాత బంగ్లా నెమ్మదిగా ఆడుతూ మ్యాచ్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినా, వెంట వెంటనే వికెట్లు పడటంతో బంగ్లా పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగవ రోజు ఆట ముగిసే సరికి ఆరు కీలక వికెట్లు కోల్పోయింది. 

238 పరుగులకు 6 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ఐదవరోజు ఆటను ప్రారంభించింది. క్రీజ్ లో షకిబల్ హసన్, మెహుదీ హసన్ మిరాజ్ కుదురుకొని ఉన్నారు. ఈ దశలో మ్యాచ్ డ్రా కాకపోయినా టీం ఇండియా విజయం కొంత ఆలస్యం అవుతుందేమో అని అనుకున్నారంతా. కానీ భారత్ బౌలర్ల దాటికి బంగ్లా బ్యాట్స్ మెన్ నిలవలేకపోయారు. ఐదవ రోజు మొదటి సెషన్ లోనే మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో టీం ఇండియా గెలుపు కాయం అయింది. కుల్దీప్ యాదవ్ కి 3, అక్షర్ పటేల్ కి 4, అశ్విన్, సిరాజ్, ఉమేష్ యాదవ్ లకు చెరొక వికెట్ లభించాయి.