పోరాడినా పాయే: మూడో వన్డేలోనూ ఓడిన టీమిండియా

పోరాడినా పాయే: మూడో వన్డేలోనూ ఓడిన టీమిండియా

కేప్‌‌టౌన్‌‌: టీమిండియాకు హార్ట్‌‌బ్రేక్‌‌. బౌలింగ్‌‌తో పాటు బ్యాటింగ్‌‌లోనూ  దీపక్‌‌ చహర్‌‌ (2/53; 34 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54) సూపర్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేసినా ఇండియా గట్టెక్కలేకపోయింది. సౌతాఫ్రికా చేతిలో వైట్‌‌వాష్‌‌ తప్పించుకోలేకపోయింది. మూడు వన్డేల సిరీస్‌‌లో భాగంగా ఆదివారం జరిగిన థర్డ్‌‌ మ్యాచ్‌‌లో సఫారీ టీమ్‌‌ 4 రన్స్‌‌తో  థ్రిల్లింగ్‌‌ విక్టరీ సాధించింది. దాంతో, 3–0తో సిరీస్‌‌ను క్లీన్‌‌స్వీప్‌‌ చేసింది.  288 రన్స్‌‌ ఛేజింగ్‌‌లో ఇండియా 223/7తో భారీ ఓటమి ముంగిట నిలిచిన టైమ్‌‌లో దీపక్‌‌ హాఫ్‌‌ సెంచరీతో సెన్సేషనల్‌‌ పెర్ఫామెన్స్‌‌ చేశాడు. బుమ్రా(12)తో కలిసి ఎనిమిదో వికెట్‌‌కు 31 బాల్స్‌‌లోనే 55 రన్స్‌‌ జోడించి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. కానీ, విక్టరీకి 10 రన్స్‌‌ ముంగిట దీపక్‌‌ ఔటవడంతో ఇండియా 49.2 ఓవర్లలో 283 రన్స్‌‌కే ఆలౌటై  ఓడిపోయింది. దీపక్‌‌తో పాటు విరాట్‌‌ కోహ్లీ (84 బాల్స్‌‌లో 5 ఫోర్లతో 65), శిఖర్‌‌ ధవన్‌‌ (73 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 61) ఫిఫ్టీలు కొట్టినా మిడిలార్డర్‌‌ ఫెయిల్యూర్‌‌ ఇండియాను ముంచింది. అంతకుముందు ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసిన సౌతాఫ్రికా 49.5 ఓవర్లలో 287 రన్స్‌‌ చేసింది. క్వింటన్‌‌ డికాక్‌‌ (130 బాల్స్‌‌లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 124) ఇండియాపై ఆరో సెంచరీ కొట్టగా.. డుసెన్‌‌ (59 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 52) ఫిఫ్టీతో రాణించాడు.  ఓపెనర్‌‌ మలన్‌‌(1), మార్‌‌క్రమ్‌‌ (15)ను దీపక్‌‌ తక్కువ స్కోర్లకే ఔట్‌‌ చేసినా.. డికాక్‌‌, డుసెన్‌‌  ఫోర్త్‌‌ వికెట్‌‌కు 144 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌తో టీమ్‌‌కు మంచి స్కోరు అందించారు. చివర్లో మిల్లర్‌‌ (39), ప్రిటోరియస్‌‌ (20) విలువైన రన్స్‌‌ చేశారు. ఇండియా బౌలర్లలో ప్రసిధ్‌‌(3/59), దీపక్‌‌ (2/53), బుమ్రా (2/52) రాణించారు. డికాక్‌‌కు ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌, సిరీస్‌‌ అవార్డులు దక్కాయి. 
 

పడిలేచి.. మళ్లీ పడి
ఛేజింగ్‌‌లో కెప్టెన్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌ (9) మళ్లీ ఫెయిలైనా మరో ఓపెనర్‌‌ ధవన్‌‌, కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్‌‌ చేశారు. హోమ్‌‌టీమ్‌‌ బౌలింగ్‌‌ను సూపర్‌‌గా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌‌ను ముందుకు తీసుకెళ్లారు. కోహ్లీ జాగ్రత్తగానే ఆడినా  శిఖర్‌‌ మాత్రం తనదైన స్పీడుతో బ్యాటింగ్‌‌ చేశాడు. ప్రిటోరియస్‌‌ వేసిన ఎనిమిదో ఓవర్లో 6, 4తో జోరు చూపాడు. తర్వాత అదే ఊపు కంటిన్యూ చేసి 58 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేసుకోగా.. 19వ ఓవర్లో ఇండియా స్కోరు వంద దాటింది.కానీ, 23వ ఓవర్లో ధవన్‌‌ను ఔట్‌‌ చేసిన ఫెలుక్వాయో థర్డ్​ వికెట్​కు 98 రన్స్​ పార్ట్​నర్​షిప్​ బ్రేక్​ చేశాడు. అదే ఓవర్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు పంత్‌‌ (0) వికెట్‌‌ పారేసుకోవడంతో ఇండియాకు డబుల్‌‌ షాక్‌‌ తగిలింది. మరో ఎండ్‌‌లో  63 బాల్స్‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌ చేసుకున్న విరాట్‌‌..స్పిన్నర్‌‌ కేశవ్‌‌ టర్నింగ్‌‌ బాల్‌‌కు బవూమకు క్యాచ్‌‌ ఇవ్వడంతో ఇండియా 156/4తో డీలా పడ్డది. ఈ దశలో శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (26), సూర్యకుమార్‌‌ యాదవ్‌‌ (39) ఐదో వికెట్‌‌కు 39 రన్స్‌‌ జోడించి ఇండియాను రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, ఐదు ఓవర్ల తేడాతో ఈ ఇద్దరితో పాటు జయంత్‌‌ యాదవ్‌‌(2)ను ఔట్‌‌ చేసిన సఫారీ టీమ్‌‌ మ్యాచ్‌‌ను చేతుల్లోకి తీసుకుంది. ఈ  టైమ్‌‌లో దీపక్‌‌ చహర్‌‌ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. వరుసపెట్టి ఫోర్లు, సిక్సర్లు కొడుతూ ఇండియాను రేసులోకి తెచ్చాడు. బుమ్రా సపోర్ట్‌‌తో టీమ్​ను గెలిపించినంత పని చేశాడు. కానీ, 48వ ఓవర్లో ఎంగిడి వైడ్‌‌ స్లోబాల్‌‌ను డ్రైవ్‌‌ చేసే ప్రయత్నంలో ప్రిటోరియస్‌‌కు క్యాచ్‌‌ ఇవ్వడంతో మ్యాచ్​ సఫారీల చేతిల్లోకి వెళ్లింది.  తర్వాతి ఓవర్లో బుమ్రా ఔటయ్యాడు. ఇక, లాస్ట్‌‌ ఓవర్లో ఆరు రన్స్‌‌ అవసరం అవగా.. రెండో బాల్‌‌కు చహల్‌‌ (2).. మిల్లర్‌‌కు క్యాచ్‌‌ ఇవ్వడంతో ఇండియాకు ఓటమి తప్పలేదు. సఫారీ బౌలర్లలో ఫెలుక్వాయో (3/40), ఎంగిడి (3/58)  ఇండియాను దెబ్బకొట్టారు.  
స్కోర్స్‌‌
సౌతాఫ్రికా: 49.5 ఓవర్లలో 287 ఆలౌట్‌‌ (డికాక్‌‌ 124, డుసెన్‌‌ 52, ప్రసిధ్‌‌ 3/59)
ఇండియా: 49.2 ఓవర్లలో 283 ఆలౌట్‌‌ (కోహ్లీ 65, ధవన్‌‌ 61, దీపక్‌‌ 54, ఫెలుక్వాయో 3/40,  ఎంగిడి 3/58).