సిరీస్​ సమం చేసిన సౌతాఫ్రికా

సిరీస్​ సమం చేసిన సౌతాఫ్రికా
  • మూడో టీ20లో ఓడిన టీమిండియా
  • జోరు మీదున్న భారత్ కు సఫారీల బ్రేక్
  • 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా గెలుపు

బెంగళూరు: టీమిండియా వరుస విజయాలకు సౌతాఫ్రికా కళ్లెం వేసింది. ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో అదరగొడుతూ ఆదివారం జరిగిన మూడో టీ20లో 9 వికెట్ల తేడాతో ఇండియాపై ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను 1–1తో సమం చేసింది. టాస్‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 134 పరుగులు చేసింది. ధవన్‌‌‌‌ (25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 36) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. తర్వాత సౌతాఫ్రికా 16.5 ఓవర్లలో వికెట్‌‌‌‌ నష్టానికి 140 రన్స్‌‌‌‌ చేసింది. డికాక్‌‌‌‌ (52 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 79) దుమ్మురేపాడు. హెండ్రిక్స్‌‌‌‌కు మ్యాన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ది మ్యాచ్‌‌‌‌, డికాక్‌‌‌‌ ‘మ్యాన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ది సిరీస్‌‌‌‌’ అవార్డులు దక్కాయి.

మెరుపు స్టార్టింగ్‌‌‌‌ దక్కినా..

టాస్‌‌‌‌ నెగ్గిన ఇండియా కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌కోహ్లీ అందరిని ఆశ్చర్యపరుస్తూ బ్యాటింగ్‌‌‌‌ ఎంచుకున్నాడు. చిన్న బౌండరీలతో కూడిన చిన్నస్వామి స్టేడియంలో టాస్‌‌‌‌ నెగ్గిన జట్టు ఛేజింగ్‌‌‌‌కే మొగ్గు చూపడం ఆనవాయితీగా వస్తోంది. ధవన్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ తొలి బంతినే బౌండరీకి పంపడంతో ఆ ఓవర్లో ఐదు పరుగులు లభించాయి. రోహిత్‌‌‌‌ శర్మ (9) విఫలమయ్యాడు. రబడ ఓవర్లో రెండు బౌండరీలతో జోరు చూపించిన రోహిత్‌‌‌‌ మరుసటి ఓవర్లో హెండ్రిక్‌‌‌‌ వేసిన చక్కని ఇన్‌‌‌‌ స్వింగర్‌‌‌‌కు పెవిలియన్‌‌‌‌కు చేరాడు. దీంతో 22 పరుగుల వద్ద హోమ్‌‌‌‌టీమ్‌‌‌‌ తొలివికెట్‌‌‌‌ను కోల్పోయింది. ఈ దశలో  కోహ్లీతో జతకలిసిన ధవన్‌‌‌‌ సపారీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. పెహుల్‌‌‌‌క్వాయో ఓవర్లో రెండు ఫోర్లు బాది జోరు చూపించిన గబ్బర్‌‌‌‌.. షంసీ వేసిన ఆరో ఓవర్లో రెండు సిక్సర్లను కొట్టాడు. దీంతో పవర్‌‌‌‌ ప్లే ముగిసేసరికి ఇండియా 54/1తో నిలిచింది. కానీ వరుస ఓవర్లలో ధవన్‌‌‌‌, కోహ్లీ (9) పెవిలియన్‌‌‌‌కు చేరారు. దీంతో శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (5), రిషబ్‌‌‌‌ (19) ఇన్నింగ్స్‌‌‌‌ను చక్కదిద్దుకునే బాధ్యతను చేపట్టారు. ఒక్కో పరుగుతో స్ట్రైక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేసిన ఈ జంట.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదింది. అయితే ఇన్నింగ్స్‌‌‌‌ 12వ ఓవర్‌‌‌‌ చివరి బంతికి కళ్లు చెదిరే సిక్సర్‌‌‌‌ను బాదిన పంత్‌‌‌‌.. తర్వాతి ఓవర్‌‌‌‌లో భారీ షాట్‌‌‌‌కు ప్రయత్నించి పెవిలియన్‌‌‌‌కు చేరాడు.  అదే ఓవర్లో శ్రేయస్‌‌‌‌, క్రునాల్‌‌‌‌ పాండ్యా (4) పెవిలియన్‌‌‌‌కు చేరడంతో ఇండియా 98 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది. చివర్లో జడేజా(19) బ్యాట్‌‌‌‌ ఝళింపించినా దాదాపు చివరి ఓవర్‌‌‌‌ వరకూ క్రీజులో నిలిచిన హార్దిక్‌‌‌‌ (18 బంతుల్లో 1 ఫోర్‌‌‌‌తో 14)భారీ షాట్లు ఆడడంలో విఫలమయ్యాడు.

తుఫాన్‌‌‌‌ వేగంతో..

చిన్న టార్గెటే కావడంతో సౌతాఫ్రికా బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌ను నింపాదిగా ప్రారంభించారు. ముఖ్యంగా డికాక్‌‌‌‌ తొలుత సమయోచితంగా ఆడి అనంతరం గేర్‌‌‌‌ మార్చి ధనాధన్‌‌‌‌తో ఆటతో మ్యాచ్‌‌‌‌ను ఏకపక్షం చేశాడు. ఇన్నింగ్స్‌‌‌‌ స్టార్టింగ్‌‌‌‌ తొలి రెండు ఓవర్లలో ఏడు పరుగులు చేసిన సఫారీలు తర్వాత జోరు చూపెట్టారు. చహర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో హెండ్రిక్స్​ రెండు బౌండరీలు బాదగా.. నవదీప్ బౌలింగ్‌‌‌‌లో డికాక్‌‌‌‌ రెండు భారీ సిక్సర్లు కొట్టడంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. ఇద్దరు ధాటిగా బ్యాటింగ్‌‌‌‌ చేయడంతో పవర్‌‌‌‌ ప్లే ముగిసేసరికి 43/0తో ప్రొటీస్‌‌‌‌ నిలిచింది. ఏడో ఓవర్‌‌‌‌లో డికాక్‌‌‌‌కు అదృష్టం కూడా కలిసి వచ్చింది. సుందర్‌‌‌‌ వేసిన ఆ ఓవర్‌‌‌‌లో స్వీప్‌‌‌‌ షాట్‌‌‌‌కు ప్రయత్నించిన సౌతాఫ్రికా కెప్టెన్‌‌‌‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే అంపైర్‌‌‌‌ నాటౌట్‌‌‌‌ ఇవ్వడంతో బతికిపోయాడు. పది ఓవర్లకు 76/0తో ప్రొటీస్‌‌‌‌ పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే 11వ ఓవర్‌‌‌‌లో బౌలింగ్‌‌‌‌కు వచ్చిన హార్దిక్‌‌‌‌ ఈ జంటను విడదీశాడు. సహచరుడు వెనుదిరిగినా జోరు తగ్గించని డికాక్‌‌‌‌ ఇదే ఓవర్‌‌‌‌లో రెండు ఫోర్లతో ఫిఫ్టీ (38 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌‌‌‌లో బవ్యూమ కూడా బ్యాట్‌‌‌‌ ఝుళిపించాడు. హార్దిక్‌‌‌‌ వేసిన 13వ ఓవర్లో ఒక ఫోర్‌‌‌‌, సిక్సర్‌‌‌‌ కొట్టిన డికాక్‌‌‌‌.. క్రునాల్‌‌‌‌ వేసిన 15వ ఓవర్‌‌‌‌లో కూడా మరోసారి ఫోర్‌‌‌‌, సిక్సర్‌‌‌‌తో రెచ్చిపోయాడు. దీంతో మరో 50 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. నాలుగు ఓవర్లలో నాలుగు పరుగులు కావాల్సిన దశలో ఇన్నింగ్స్‌‌‌‌ 17వ ఓవర్‌‌‌‌లో ఐదో బంతిని స్టాండ్‌‌‌‌లోకి పంపిన బవ్యూమా మ్యాచ్‌‌‌‌ను ముగించాడు.

స్కోరు బోర్డు

ఇండియా: ధవన్‌‌ (సి) బవ్యూమా (బి) షంసీ 36, రోహిత్‌‌ (సి) ఆర్‌‌. హెండ్రిక్స్‌‌ (బి) బి. హెండ్రిక్స్‌‌ 9, కోహ్లీ (సి) పెహుల్‌‌క్వాయో (బి) రబడ 9, పంత్‌‌ (సి) పెహుల్‌‌క్వాయో (బి) ఫోర్టిన్‌‌ 19, శ్రేయస్‌‌ (స్టంప్‌‌) డికాక్‌‌ (బి) ఫోర్టిన్‌‌ 5, హార్దిక్‌‌ (సి) మిల్లర్‌‌ (బి) రబడ 14, క్రునాల్‌‌ (సి) డికాక్‌‌ (బి) బి. హెండ్రిక్స్‌‌ 4, జడేజా (సి అండ్‌‌ బి) రబడ 19, సుందర్‌‌ (రనౌట్‌‌) 4, దీపక్‌‌ (నాటౌట్‌‌) 0, సైనీ (నాటౌట్‌‌) 0, ఎక్స్‌‌ట్రాలు: 15, మొత్తం: 20 ఓవర్లలో 134/9.

వికెట్లపతనం: 1–22, 2–63, 3–68, 4–90, 5–92, 6–98, 7–127, 8–133, 9–133.

బౌలింగ్‌‌: ఫోర్టిన్‌‌ 3–0–19–2, రబడ 4–0–39–3, బి. హెండ్రిక్స్‌‌ 4–0–14–2, పెహుల్‌‌క్వాయో 4–0–28–0, షంసీ –0–23–1, ప్రిటోరియస్‌‌ 1–0–8–0.

సౌతాఫ్రికా: ఆర్‌‌. హెండ్రిక్స్‌‌ (సి) కోహ్లీ (బి) హార్దిక్‌‌ 28, డికాక్‌‌ (నాటౌట్‌‌) 79, బవ్యూమా (నాటౌట్‌‌) 27, ఎక్స్‌‌ట్రాలు: 6, మొత్తం: 16.5 ఓవర్లలో 140/1.

వికెట్లపతనం: 1–76.

బౌలింగ్‌‌: సుందర్‌‌ 4–0–27–0, దీపక్‌‌ 3–0–15–0, సైనీ 2–0–25–0, క్రునాల్‌‌ 3.5–0–40–0, హార్దిక్‌‌ 2–0–23–1, జడేజా 2–0–8–0.