- సెకండ్ టీ20లో ఇండియా గెలుపు
- 2‑0తో సిరీస్ సొంతం
- 7 వికెట్ల తేడాతో ఓడిన శ్రీలంక
- నిసాంక శ్రమ వృధా
ఇండియా ఖాతాలో మరో సిరీస్..! మొన్న వెస్టిండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పుడు లంకేయుల భరతం పట్టింది..! భారీ టార్గెట్ ఛేజింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (44 బాల్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 74 నాటౌట్), రవీంద్ర జడేజా (18 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 45 నాటౌట్) దంచికొట్టడంతో.. సెకండ్ టీ20లో ఇండియా గ్రాండ్ విక్టరీని అందుకుంది..! దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది..! ఇక ఫస్ట్ వన్డేలో విఫలమైన లంక.. ఈ మ్యాచ్‌లో సూపర్ బ్యాటింగ్ చేసినా.. టీమిండియా కుర్రాళ్ల జోరు ముందు టార్గెట్‌ను కాపాడుకోలేకపోయింది..!
ధర్మశాల: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఇండియా.. సెకండ్ టీ20లోనూ దుమ్మురేపింది. బౌలింగ్‌లో కొద్దిగా తడబడినా.. బ్యాటింగ్‌లో సూపర్ షో చూపెడుతూ.. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లోనూ 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. టీ20ల్లో ఇండియాకు ఇది వరుసగా 11వ విజయం. టాస్ గెలిచి ఇండియా బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 183/5 స్కోరు చేసింది. పాథుమ్ నిసాంక (53 బాల్స్‌లో 11 ఫోర్లతో 75), దసున్ షనక (19 బాల్స్‌లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 47 నాటౌట్), గుణతిలక (29 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38) ఆకట్టుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా17.1 ఓవర్లలో 186/3 స్కోరు చేసి గెలిచింది. శ్రేయస్, జడేజాతో పాటు సంజూ శాంసన్ (25 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39) రాణించాడు. శ్రేయస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరిదైన థర్డ్ టీ20 ఆదివారం జరుగుతుంది.
రాణించిన నిసాంక, షనక
స్టార్టింగ్ స్లోగా ఆడిన లంకేయులు.. లాస్ట్‌లో మాత్రం దంచికొట్టారు. ఓపెనర్లు నిసాంక, గుణతిలక నెమ్మదిగా ఆడటంతో.. పేసర్లు భువనేశ్వర్, బుమ్రా 4 ఓవర్లలో 15 రన్స్ మాత్రమే ఇచ్చారు. 5వ ఓవర్ (హర్షల్)లో రెండు ఫోర్లు రావడంతో కాస్త జోరు పెంచిన ఈ ఇద్దరు.. ఆ తర్వాతి నుంచి ఓవర్‌కు ఓ ఫోర్ ఉండేలా జాగ్రత్తపడ్డారు. జడేజా వేసిన 9వ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్, సిక్స్ బాదిన గుణతిలక తర్వాతి బంతిని షాట్ ఆడబోగా.. అది కాస్తా గాల్లోకి లేవడంతో వెంకటేశ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఫస్ట్ వికెట్‌కు 67 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. తర్వాత చరిత్ అసలంక (2), కమిల్ మిశ్రా (1), దినేశ్ చండీమల్ (9) కొద్ది గ్యాప్ లోనే పెవిలియన్ చేరడంతో ఇండియా ట్రాక్ లోకి వచ్చింది. కానీ ఓవైపు వికెట్లు పడుతున్నా నిసాంక మాత్రం సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 16వ ఓవర్ నాలుగో బంతిని ఫోర్ బాది హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. రెండో ఎండ్‌లో కెప్టెన్ షనక కూడా మంచి సహకారం అందించాడు. 17వ ఓవర్లో షనక రెండు సిక్స్‌లు, ఓ ఫోర్, 18వ ఓవర్లో నిసాంక మూడు ఫోర్లు, 19 ఓవర్లో షనక సిక్స్, ఫోర్ బాదాడు. ఇదే ఓవర్ చివరి బంతికి నిసాంక ఔటైనా.. చివరి ఓవర్లో షనక ఓ ఫోర్, రెండు సిక్స్ లు బాదాడు. చివరి 5 ఓవర్లలో 80 రన్స్ రావడంతో లంకకు భారీ స్కోరు సాధ్యమైంది.
శ్రేయస్, జడేజా సూపర్..
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఇండియాకు మెరుగైన ఆరంభం లభించలేదు. లంక బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడటంతో.. ఇన్నింగ్స్ ఆరో బాల్‌కే రోహిత్ (1) ఔట్‌కాగా, ఆరో ఓవర్‌లో ఇషాన్ కిషన్ (16) వెనుదిరిగాడు. 44 రన్స్‌కే 2 వికెట్లు కోల్పోయిన ఇండియాను ఆదుకునే బాధ్యత తీసుకున్న శ్రేయస్, శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. రెండు ఓవర్లు నెమ్మదిగా ఆడిన ఈ జోడీ.. తర్వాత రెచ్చిపోయింది. 9వ ఓవర్‌లో శ్రేయస్ బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు దంచాడు. నెక్స్ట్ ఓవర్‌లో శాంసన్ బౌండ్రీలతో 10 రన్స్ రాబట్టాడు. దీంతో పవర్‌ప్లేలో 46/2 ఉన్న స్కోరు ఫస్ట్ టెన్‌లో 80/2కు పెరిగింది. 11వ ఓవర్‌లో లాంగాన్‌లో భారీ సిక్సర్ కొట్టి 30 బాల్స్‌లోనే శ్రేయస్ హాఫ్ సెంచరీ కంప్లీట్‌చేశాడు. ఆ వెంటనే మరో సిక్సర్ బాదాడు. ఇక 13వ ఓవర్ (కుమార)లో శాంసన్ వరుసగా 4, 6, 6, 6 కొట్టి ఔటయ్యాడు. ఈ ఓవర్‌లో 23 రన్స్ రాగా ఫెర్నాండో సింగిల్ హ్యాండ్ క్యాచ్ హైలెట్ (శాంసన్)గా నిలిచింది. శ్రేయస్, శాంసన్ 47 బాల్స్‌లోనే 84 రన్స్ జోడించారు. ఫోర్‌తో ఖాతా తెరిచిన జడేజా ప్రతి ఓవర్‌లో ఒకటి, రెండు బౌండ్రీలతో మోత మోగించాడు. 16వ ఓవర్లో వరుసగా 6, 4, 4, 4తో 22 రన్స్ పిండుకున్నాడు. ఇక గెలవాలంటే 24 బాల్స్‌లో 9 రన్స్ కావాల్సిన దశలో జడేజా ఫోర్‌తో విజయాన్ని ఖాయం చేశాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 26 బాల్స్‌లోనే 58 రన్స్ జోడించారు.
స్కోరు బోర్డు
శ్రీలంక: నిసాంక (ఎల్బీ) భువనేశ్వర్ 75, గుణతిలక (సి) వెంకటేశ్ (బి) జడేజా 38, అసలంకా (ఎల్బీ) చహల్ 2, కామిల్ మిశ్రా (సి) శ్రేయస్ (బి) పటేల్ 1, చండిమల్ (సి) రోహిత్ (బి) బుమ్రా 9, షనక (నాటౌట్) 47, కరుణరత్నె (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 20 ఓవర్లలో 183/5. వికెట్లపతనం: 1–67, 2–71, 3–76, 4–102, 5–160. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–36–1, బుమ్రా 4–0–24–1, హర్షల్ పటేల్ 4–0–52–1, చహల్ 4–0–27–1, జడేజా 4–0–37–1.
ఇండియా: రోహిత్ (బి) చమీరా 1, ఇషాన్ కిషన్ (సి) షనక (బి) కుమార 16, శ్రేయస్ (నాటౌట్) 74, శాంసన్ (సి) ఫెర్నాండో (బి) కుమార 39, జడేజా (నాటౌట్) 45, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 17.1 ఓవర్లలో 186/3. వికెట్లపతనం: 1–9, 2–44, 3–128. బౌలింగ్: చమీరా 3.1–0–39–1, ఫెర్నాండో 4–0–47–0, కుమార 3–0–31–2, జయవిక్రమ 2–0–19–0, కరుణరత్నె 3–0–24–0, షనక 2–0–24–0.

