రష్యా నుంచి కాదు.. ఇకపై వెనిజులా నుంచే ఇండియా ఆయిల్ కొంటుంది: ట్రంప్ ప్రకటన

రష్యా నుంచి కాదు.. ఇకపై వెనిజులా నుంచే ఇండియా ఆయిల్ కొంటుంది: ట్రంప్ ప్రకటన

రష్యా నుంచి ఇండియా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడంపై నానా గగ్గోలు పెడుతూ వస్తున్న ట్రంప్.. మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇండియా రష్యా ఆయిల్ కు గుడ్ బై చెబుతుందని.. ఇక నుంచి వెనిజులా నుంచే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. అందుకు సంబంధించిన డీల్ సెట్ అయినట్లు పేర్కొన్నారు ట్రంప్. 

వెనుజులా ప్రసిడెంట్ నికోలస్ మదురోను జనవరి 03న బంధీగా పట్టుకున్న తర్వాత.. ట్రంప్ ఆదివారం (ఫిబ్రవరి 01) చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక నుంచి ఇండియాతో పాటు చాలా దేశాలు వెనుజులా నుంచి ఆయిల్ కొంటాయని.. అందుకు ఒప్పందాలు జరిగిపోతున్నట్లు చెప్పారు. 

ఆయిల్ డీల్ ప్రతిపాదనను చైనా ఆహ్వానించింది.. మేము ఆల్ రెడీ ఒప్పందం కూడా చేసుకున్నాం. ఇండియా కూడా వస్తుంది.. ఇండియా, చైనా లాంటి పెద్ద దేశాలు వెనుజులా నుంచి ఆయిల్ కొనటానికి ముందుకు వస్తున్నాయి. ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలును తాము వ్యతిరేకించడంతో.. మేము చెప్పినట్లుగా వెనుజులాతో ఒప్పందానికి పలు దేశాలు ముందుకు వస్తున్నాయి.. అంటూ  ప్రకటించారు ట్రంప్. 

అమెరికా నుంచి వాణిజ్య ఒత్తిళ్లు పెరుగుతున్న క్రమంలో.. ఇండియా రిఫైనరీలు రష్యా ఆయిల్ దిగుమతులను తగ్గిస్తూ వస్తున్నాయి. రష్యా క్రూడ్ దిగుమతి చేసుకుంటే భారత వస్తువులపై మరో 25 శాతం టారిఫ్స్ వేస్తామన్న అమెరికా హెచ్చరికలతో భారత కంపెనీలు రష్యా కొనుగోళ్లను తగ్గిస్తూ వస్తున్నాయి. 

జనవరి 30 న ప్రధాని మోదీ.. వెనుజులా ప్రస్తుత అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ తో చర్చలు జరిపారు. ఇరు దేశాల సంబంధాలను బలపర్చే నిర్ణయాలు తీసుకోవాలని ఈ భేటీలో చర్చించారు. హైడ్రోకార్బన్ సెక్టార్ పై ఉన్న నిబంధనలను వెనుజులా సడలించిన తర్వాత.. మోదీ భేటీ కీలకంగా మారింది. దశాబ్దాలుగా కఠిన నిబంధనలను సడలించడంతో ఇతర దేశాల ప్రైవేట్ సంస్థల ఏర్పాటుకు అవకాశం కలగనుంది. పన్నులు, రాయల్టీలను తగ్గించడం, ప్రైవేట్ సంస్థలు క్రూడ్ అన్వేషణ, ఉత్పత్తి, మార్కెటింగ్ చేసుకునే అవకాశం కల్పించేలా వెనుజులా నిబంధనలు మార్చింది. దీంతో వెనుజులాలో ఇండియన్ కంపెనీల ఏర్పాటుతో పాటు ఆయిల్ కొనుగోలుకు కూడా మార్గం సుగమం అవుతున్నట్లు ట్రంప్ ప్రకటన ద్వారా స్పష్టమవుతుంది.