IND vs ENG 4th Test: ఇంగ్లాండ్‌పై భారత్ ఉత్కంఠ విజయం ..3-1 తో సిరీస్ కైవసం

IND vs ENG 4th Test: ఇంగ్లాండ్‌పై భారత్ ఉత్కంఠ విజయం ..3-1 తో సిరీస్ కైవసం

రాంచీ టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. యువ బ్యాటర్ శుభమన్ గిల్(52), రోహిత్ శర్మ (55) అర్ధ సెంచరీలతో 5 వికెట్ల తేడాతో ఇంగ్లీష్ జట్టును చిత్తు చేసింది. ఒక దశలో 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును గిల్, వికెట్ కీపర్ జురెల్ ఎంతో ఓపిగ్గా ఆడుతూ భారత్ కు విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరి 72 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్ తో పాటు 3-1 తో సిరీస్ ను కైవసం చేసుకుంది. 

192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు విజయం అంత ఈజీగా రాలేదు. లక్ష్యం చిన్నదైనా మన బ్యాటర్లు ఒకానొక దశలో తడబడ్డారు. వికెట్లేమీ కోల్పోకుండా 80 పరుగులు చేసి విజయం దిశగా దూసుకెళ్తున్న భారత్ కు ఇంగ్లాండ్ స్పిన్నర్లు వరుస షాకులు ఇచ్చారు. చక చక 5 వికెట్లు తీసి భారత శిబిరాన్ని ఆందోళనకు గురి చేశారు. స్పిన్ కూడా పిచ్ కు అనుకూలించడంతో భారత్ విజయంపై అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. అయితే గిల్, జురెల్ ఎలాంటి చెత్త షాట్లకు పోకుండా విజయాన్ని ఖరారు చేశారు. గిల్ 52 పరుగులు చేస్తే.. జురెల్ 39 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.  

ఈ టెస్ట్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్..రూట్ (121) సెంచరీతో 353 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ జురెల్ 90 పరుగులతో రాణించడంతో 307 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 145 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ తో ధర్మశాలలో జరగబోయే చివరి టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో భారత్ సిరీస్ గెలుచుకుంది. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఓడిపోయిన తర్వాత వరుసగా వైజాగ్, రాజ్ కోట్, రాంచీ టెస్టులో వరుస విజయాలు సాధించింది.