హైదరాబాద్: అండర్-19 వరల్డ్ కప్‌లో ఆరోసారి విశ్వ విజేతగా నిలిచిన యంగ్ ఇండియా టీమ్ ఆదివారం (ఫిబ్రవరి 8) స్వదేశానికి చేరుకుంది. ఎయిర్‌పోర్టులో ప్లేయర్ల కుటుంబ సభ్యులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు యువ హీరోలకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే ఇండియా అండర్ 19 వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాద్ క్రికెటర్ ఆరోన్ జార్జ్‌కు శంషాబాద్ ఎయిర్ పోర్టులో కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు.
ఈ సందర్భంగా ఆరోన్ జార్జ్ V6 ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. తనకు అండగా నిలిచిన వారందరికీ నా విజయాన్ని అంకితం చేస్తున్నానని అన్నారు. కోచ్‌తో పాటు అందరూ చాలా మంచిగా సహకరించేవారన్నారు. ఒక వైపు చదువు.. మరోవైపు ఆట రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నానని చెప్పాడు. క్రికెట్‌ను ఫ్యాషన్‌గా తీసుకున్నానని.. రానున్న రోజుల్లో ఇండియా మరిన్ని కప్‌లు సాధించడంలో ముందు ఉంటానన్నాడు.
జింబాబ్వే వికెట్ కొంత డిఫరెంట్‌గా ఉందని.. అయినప్పటికీ సెమీస్‌లో విజయవంతంగా ఛేజింగ్ చేశామన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో అందరం మంచి కో ఆర్డినేషన్‌తో ఉన్నామని.. కచ్చితంగా గెలవాలనే సంకల్పంతో ప్రతి మ్యాచులో బరిలోకి దిగామని చెప్పాడు. అండర్ 19 వరల్డ్ కప్ లో రెండు సెంచరీలు చేయడం ఆనందంగా ఉందన్నాడు. భవిష్యత్‌లో టీమిండియా సీనియర్ జట్టు తరుఫున ఆడటమే తన లక్ష్యమని చెప్పాడు. కచ్చితంగా సీనియర్ టీములో ఆడుతాననే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు.
