బ్యాంకాక్: ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ టోర్నమెంట్ స్టేజ్–1లో ఇండియా ఆర్చర్లు సత్తా చాటారు. రెండు క్యాంస్య పతకాలు నెగ్గడంతో పాటు నలుగురు ఫైనల్స్‌కు చేరారు. గురువారం జరిగిన మెన్స్ కాంపౌండ్ బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో రజత్ చౌహాన్–రిషబ్ యాదవ్–ఉదయ్ కాంబోజ్‌తో కూడిన ఇండియా త్రయం 234–233 తేడాతో భుటాన్‌పై గెలిచింది. విమెన్స్ రికర్వ్ విభాగంలో రుమా బిస్వాస్–క్రితి–రిధి పోర్ తో కూడిన ఇండియా త్రయం 5–1 తేడాతో మలేసియాను ఓడించి కాంస్యాన్ని సొంతం చేసుకుంది.
మెన్స్ రికర్వ్ సెమీస్‌లో ఇండియా (దేవాంగ్ గుప్తా, సుక్‌చైన్ సింగ్, జుయెర్ సర్కార్) 5–1తో మలేసియాపై గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది. తెలంగాణ ఆర్చర్ చికితా తానిపర్తి–రాజ్ కౌర్–తేజల్ సాల్వితో కూడిన విమెన్స్ కాంపౌండ్ టీమ్ సెమీస్‌లో 229–226తో థాయ్‌లాండ్‌పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక వ్యక్తిగత విభాగాల్లో మూడు పతకాలు ఖాయమయ్యాయి.
మెన్స్ కాంపౌండ్ ఇండివిడ్యువల్ సెమీస్‌లో ప్రథమేశ్ జావకర్ 149–148తో రజత్ చౌహాన్‌పై, ఉదయ్ కాంబోజ్ 147–145తో పీరవత్ రత్తనపొంగ్‌కియాత్ (థాయ్‌లాండ్)ను ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టారు. విమెన్స్ రికర్వ్ ఇండివిడ్యువల్ సెమీస్‌లో రిధి ఫోర్ 6–0తో జింగ్ లీ జోయ్ టాన్ (మలేసియా)పై నెగ్గి గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు అర్హత సాధించింది.
