అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. తోటి స్నేహితులను కాపాడే ప్రయత్నంలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని లూసియానాలో ఉన్న టోరోడో పార్క్ సెబాన్ నదిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నదిలో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోతున్న ముగ్గురు స్నేహితులను చూసి అనురూప్ రెడ్డి ఏమాత్రం ఆలోచించకుండా నదిలోకి దూకాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి ముగ్గురు స్నేహితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు.
కానీ, దురదృష్టవశాత్తూ అందరినీ కాపాడిన తర్వాత అనురూప్ రెడ్డి నీటిలో ఉన్న చేపల వలలో చిక్కుకుపోయాడు. దాంతో అతను నీటిలో నుంచి బయటకు రాలేకపోయాడు. స్థానికులు గమనించి వెంటనే అతడిని ఒడ్డుకు చేర్చి ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అనురూప్ రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
►ALSO READ | నా పుట్టుక .. నా జీవితమంతా BRS.. పార్టీ మార్పు ప్రచారంపై హరీష్ రావు క్లారిటీ
మృతుడు అనురూప్ రెడ్డి అమెరికాలోని 'యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్'లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. అనురూప్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లి గ్రామం. ముగ్గురి ప్రాణాలు కాపాడి, తను మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన అనురూప్ రెడ్డి మరణవార్త వినగానే కవాడిపల్లి గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. కన్నకొడుకు ఇక లేడనే వార్త తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
