నా పుట్టుక .. నా జీవితమంతా BRS.. పార్టీ మార్పు ప్రచారంపై హరీష్ రావు క్లారిటీ

నా పుట్టుక .. నా జీవితమంతా BRS.. పార్టీ మార్పు ప్రచారంపై హరీష్ రావు క్లారిటీ

హైదరాబాద్: వచ్చే ఎన్నికల నాటికి హరీష్ రావు బీజేపీలో చేరుతారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఆదివారం (మే 31) సిద్దిపేటలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తన పుట్టుక బీఆర్ఎస్.. జీవితమంతా బీఆర్ఎస్ పార్టీనేనని పార్టీ మార్పు ప్రచారాన్ని తిప్పికొట్టారు. నాలుగు పార్టీలు మారిన సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదని కౌంటర్ ఇచ్చారు. 
 
‘‘నా పుట్టుక బీఆర్ఎస్.. నా జీవితమంతా బీఆర్ఎస్. జీవితాంతం కేసీఆర్‎తోనే ఉంటానని ఇప్పటికే వందసార్లు చెప్పినా.. మళ్లీ అదే చెప్తున్న. నాలుగు పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి నా గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది..? ఆయన రేపు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియదు. అసలు రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఎక్కడుంది..? అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ అడ్డదారిలో అధికారం అనుభవించడం తప్ప ఆయన చేసింది ఏముంది..? రేవంత్ రెడ్డి కాంగ్రెస్‎లో ఉండి బీజేపీ పాట పాడుతున్నారు’’ అని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. 

సీఎం రేవంత్‎కు హరీష్ రావు సవాల్

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తేనే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పగలరా అని ఛాలెంజ్ చేశారు. ఆదివారం (మే 31) సిద్దిపేటలో హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు చాలని అంటున్నారని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత ఇస్తేనే ఓట్లు అడుగుతానని, లేదంటే అడగనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. 

►ALSO READ | సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్

తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంట్ రావడం లేదని.. కావాలంటే రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్లి రైతులనే అడుగుదామన్నారు. రైతులకు ఎక్కడా కనీసం 13 గంటల కరెంటు కూడా రావడం లేదని అన్నారు. ఇవాళ బీజేపీ నేతృత్వంలోని గుజరాత్‌లో రైతులకు 7 గంటల కరెంటు మాత్రమే వస్తుంది.. అలాగే కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతులకు 8 గంటల కరెంటు మాత్రమే వస్తుందన్నారు. రేపు తెలంగాణలో కూడా అలానే జరగబోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 24 గంటల కరెంట్‏కు సీఎం రేవంత్ రెడ్డి మంగళం పాడారని విమర్శించారు.