సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్

సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తేనే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పగలరా అని ఛాలెంజ్ చేశారు. ఆదివారం (మే 31) సిద్దిపేటలో హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి రైతులకు 3 గంటల కరెంటు చాలని అంటున్నారని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత ఇస్తేనే ఓట్లు అడుగుతానని, లేదంటే అడగనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంట్ రావడం లేదని.. కావాలంటే రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్లి రైతులనే అడుగుదామన్నారు. రైతులకు ఎక్కడా కనీసం 13 గంటల కరెంటు కూడా రావడం లేదని అన్నారు. ఇవాళ బీజేపీ నేతృత్వంలోని గుజరాత్‌లో రైతులకు 7 గంటల కరెంటు మాత్రమే వస్తుంది.. అలాగే కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతులకు 8 గంటల కరెంటు మాత్రమే వస్తుందన్నారు. రేపు తెలంగాణలో కూడా అలానే జరగబోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 24 గంటల కరెంట్‏కు సీఎం రేవంత్ రెడ్డి మంగళం పాడారని విమర్శించారు. 

►ALSO READ | తెలంగాణ పలు జిల్లాల్లో అకాల వర్షాలు.. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన జొన్నలు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన రైతు డిస్కంతో రైతులకు 8 గంటలకు మించి విద్యుత్ అందదని అన్నారు. ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో రైతులకు 24 గంటల విద్యుత్ రాదన్నారు. రైతు డిస్కంపై సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారన్నారు. ఆర్పీడీసీఎల్ రైతుల పాలిటి ఉరిగా మారుతుందని హాట్ కామెంట్ చేశారు. సాగు, తాగు నీరు ప్రాజెక్టులకు డిస్కం ఏర్పాటుతో ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు.

 అసలు ఆర్పీడీసీఎల్ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ల నిర్వహణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఏ జిల్లాకు నీరు రావాలన్ని 24 గంటల విద్యుత్ అవసరమన్నారు. ఆర్పీడీసీఎల్ వస్తే మంచి నీటి కటకట తప్పదన్నారు. ఇప్పుడున్నా రెండు డిస్కంలనే నడపలేకపోతున్నారు.. మూడో డిస్కం ఎందుకని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృథా చేస్తుందని విమర్శించారు.