అస్సాంలో అతిపెద్ద జైలు కాని జైలు

అస్సాంలో అతిపెద్ద జైలు కాని జైలు

గౌహతి: ఆరు ఎకరాల స్థలం. ఏడు ఫుట్​బాల్​మైదానాలంత విస్తీర్ణం. దాని మధ్యలో 15 వరకూ నాలుగంతస్తుల బిల్డింగులు.  వాటిలో దాదాపు 3 వేల మందిని ఉంచేందుకు రూంలు. ఒక కామన్​కిచెన్,180 టాయిలెట్లు, వాష్​రూంలు. ఆ కాంప్లెక్స్ చుట్టూ 20 అడుగుల ఎత్తున ప్రహరీ. అక్కడక్కడా వాచ్​టవర్లు కూడా.. ఏంటీ ఏదో కొత్త జైలు కడుతున్నట్లున్నారే అనుకుంటున్నారా? జైలు లాంటిదే.. కానీ జైలు కాదు. అస్సాంలో సర్కారు లెక్కల్లోకి రాని వారిని అరెస్టు చేసి, ఉంచేందుకు కడుతున్న మొట్టమొదటి డిటెన్షన్ సెంటర్​ఇది!  గౌహతికి 150 కి.మీ. దూరంలోని గోల్ పాడా వద్ద నిర్మిస్తున్న ఈ కాంప్లెక్స్ ఈ ఏడాది డిసెంబరు నాటికి రెడీ కానుంది. దీనిని అస్సాం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్​సంస్థ రూ. 46 కోట్లతో నిర్మిస్తోంది. ఇలాంటివే మరో 9 డిటెన్షన్ సెంటర్లనూ అస్సాంలో నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

లెక్క తేలనోళ్లు 19 లక్షలకు పైనే 

అస్సాంలో ప్రభుత్వ లెక్కల్లోకి రానివారు సుమారుగా19 లక్షలకు పైనే ఉన్నారని గత నెలలో విడుదలైన నేషనల్​రిజిస్టర్​ఆఫ్​సిటిజెన్స్ (ఎన్ఆర్ సీ) ద్వారా తేలింది. అయితే, ఎన్ఆర్ సీలో పేర్లు లేనివారినందరినీ వెంటనే దేశం నుంచి పంపేయమని, వారంతా ఫారిన్ ట్రిబ్యునళ్లు, కోర్టులకు వెళ్లి తాము ఇండియన్లమేనని ప్రూవ్​ చేసుకోవచ్చనీ కేంద్రం తెలిపింది. ఇందుకోసం గడువును 60 రోజుల నుంచి120 రోజులకు పెంచింది. ఇక ఆ గడువులోపు తాము ఇండియన్లమే అని ప్రూవ్​చేసుకోవాల్సిన బాధ్యత వాళ్లపైనే ఉంది. గడువు దాటినా తాము ఇండియన్లమని నిరూపించుకోనివాళ్లను ముందుగా ఈ డిటెన్షన్​సెంటర్లకు తరలించి, ఆ తర్వాత దేశం నుంచి పంపనున్నారని చెబుతున్నారు.

జైలులానే ఉంటుందా?

డిటెన్షన్ సెంటర్ కాంప్లెక్స్ చుట్టూ బయటివైపు 20 అడుగుల ఎత్తైన గోడ ఉంటుంది. లోపలివైపున 6 అడుగుల ఎత్తుతో మరో గోడ ఉంటుంది. అరెస్టు చేసి తీసుకొచ్చిన వాళ్ల కోసం హాస్పిటల్, ఆడిటోరియం ఉంటాయి. ఈ సెంటర్ కు బయటనే ఒక ప్రైమరీ స్కూల్ కూడా ఏర్పాటు చేయనున్నారు. చూడటానికి జైలులాగానే అనిపిస్తున్నా, దీనిని జైలులా అనిపించకుండా హాస్టల్​మాదిరిగా ఫీలయ్యేలా సౌకర్యాలు కల్పిస్తామని అస్సాం పోలీసు ఆఫీసర్లు చెబుతున్నారు. రూంలన్నీ హాస్టళ్లలో ఉన్నట్లే ఉంటాయని, ఒక్కో రూంలో నలుగురైదుగురిని మాత్రమే ఉంచుతామని అంటున్నారు. జైలులా కాకుండా హాస్టల్​రూంల మాదిరిగానే అన్ని ఏర్పాట్లు ఉంటాయంటున్నారు. డిటెన్షన్ సెంటర్లలో పిల్లలు, పసిబిడ్డలు గల తల్లులకు, మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి గత జులైలోనే పార్లమెంటుకు వెల్లడించారు కూడా. డిటెన్షన్ సెంటర్లో ఉండే పిల్లలందరినీ దగ్గరలోని స్కూళ్లలో చదివిస్తామనీ ఆయన స్పష్టం చేశారు.

ఆరేళ్ల ఉద్యమంతో కదలిక

బంగ్లాదేశ్ నుంచి అస్సాంకు అక్రమంగా వచ్చినవారి వల్ల తాము అవకాశాలను కోల్పోతున్నామంటూ అస్సాం ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. మొదటిసారిగా ఎన్ఆర్ సీని1951లో పబ్లిష్​చేశారు. ఆ తర్వాత అక్రమ వలసదారులు పెరిగారని, వారిని వెనక్కి పంపాలంటూ 1979 నుంచి 1985 వరకూ ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారులను గుర్తించి, ఎన్ఆర్ సీని అప్​డేట్​చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. అప్ డేట్​చేసిన లిస్ట్ ను గత నెలలో ప్రకటించింది.