ఆరు నెలల గరిష్టానికి భారత ఎగుమతులు.. మేలో 18 శాతం వృద్ధి

ఆరు నెలల గరిష్టానికి భారత ఎగుమతులు.. మేలో 18 శాతం వృద్ధి
  • గత నెల 28.21 బిలియన్ డాలర్లకు చేరిన వాణిజ్య లోటు

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో  ఉద్రిక్తతలు కొనసాగినప్పటికీ, ఈ ఏడాది మే నెలలో భారతదేశ ఎగుమతులు ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. గత ఏడాది మే నెలతో పోలిస్తే  18 శాతం వృద్ధి చెంది 45.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ తెలిపారు. అయితే, ముడిచమురు ధరలు పెరగడంతో దిగుమతుల విలువ కూడా 10శాతం పెరిగి 73.41 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. దీంతో వాణిజ్య లోటు  28.21 బిలియన్ డాలర్లకు చేరింది. 

ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 28.38 బిలియన్ డాలర్లుగా, కిందటేడాది మే నెలలో 21.88 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మేలో  ఎలక్ట్రానిక్ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజనీరింగ్ సామగ్రి, ఫార్మా  ఎగుమతులు ఎక్కువగా జరిగాయి.  ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో (ఏప్రిల్,- మే) మొత్తం ఎగుమతులు ఏడాది లెక్కన 16 శాతం పెరిగి 88.91 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 15 శాతం పెరిగి 145.35 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 56.44 బిలియన్ డాలర్లుగా ఉంది.

కరెంట్ అకౌంట్ మిగులు 

సేవలు  ఎగుమతులు పెరగడంతో ఈ ఏడాది ఏప్రిల్‌‌లో దేశ కరెంట్ అకౌంట్ 4.7 బిలియన్ డాలర్ల మిగులును నమోదు చేసింది. ఏప్రిల్‌‌, 20‌‌‌‌25లో 4.8 బిలియన్ డాలర్ల  లోటు ఉంది.