సెబీ ముందుకు జియో మెగా ఐపీఓ: అంబానీ కీలక ప్రకటన.. మార్కెట్లోకి 27 కోట్ల కొత్త షేర్లు

సెబీ ముందుకు జియో మెగా ఐపీఓ: అంబానీ కీలక ప్రకటన.. మార్కెట్లోకి 27 కోట్ల కొత్త షేర్లు

దేశ కార్పొరేట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓకి తెరలేచింది రిలయన్స్ ఇండస్ట్రీస్. దేశీయ టెలికాం దిగ్గజం 'జియో ప్లాట్‌ఫార్మ్స్ లిమిటెడ్' పబ్లిక్ ఇష్యూకి వెళ్లేందుకు రిలయన్స్ బోర్డు అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మెగా ఐపీఓ ద్వారా రూ.10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 27 కోట్ల కొత్త షేర్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. సెబీ దగ్గర (జూన్ 19)ఇవాళే ప్రాస్పెక్టస్(DRHP) దాఖలు చేయనున్నట్లు ముఖేష్ అంబానీ ప్రకటించారు.

రిలయన్స్ 49వ వార్షిక ఏజీఎంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. ధీరూభాయ్ అంబానీ వారసత్వాన్ని తాను ముందుకు తీసుకెళ్లినట్లే.. జియో ఐపీఓ ప్రక్రియను ఆకాష్, ఇషా, అనంత్ అంబానీలు విజయవంతంగా నడిపిస్తున్నారని తెలిపారు. ఈ ఐపీఓ ద్వారా ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థలను, గ్లోబల్ వాల్యూను భారత్ సృష్టించగలదని ప్రపంచానికి నిరూపిస్తామన్నారు. 10 ఏళ్ల క్రితం డేటా ఖరీదైన సమయంలో ఉచిత వాయిస్ కాల్స్, చౌకైన హై-స్పీడ్ డేటాతో జియో డిజిటల్ విప్లవాన్ని తెచ్చిందని, ఇప్పుడు జియో తన తర్వాతి పెద్ద మిషన్‌కు సిద్ధమవుతోందని అన్నారు.

జియో ఐపీఓ విలువ దాదాపు రూ.35వేల కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా. జెఫెరీస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ అంచనా ప్రకారం రిలయన్స్ జియో మార్కెట్ విలువ ఏకంగా 180 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం 52.4 కోట్ల మంది వినియోగదారులతో జియో దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌గా నిలిచింది. చైనా తర్వాత ఒకే ఒక టెలికాం కంపెనీ నిర్వహిస్తున్న అతిపెద్ద 5G నెట్‌వర్క్ జియోనే కావడం ఇక్కడ విశేషం.

►ALSO READ | ఉద్యోగులకు డబుల్ ధమాకా: పీఎఫ్ ఖాతాల్లోకి వడ్డీ డబ్బులు.. ఇకపై UPI, ATMల ద్వారా కూడా విత్‌డ్రా!

జియో 5G సబ్‌స్క్రైబర్ల సంఖ్య 27 కోట్లకు చేరిందని ఆకాష్ అంబానీ తెలిపారు. గడిచిన ఏడాదిలోనే 7.7 కోట్ల మంది కొత్తగా 5G నెట్‌వర్క్‌లోకి వచ్చారని వెల్లడించారు. 2030 నాటికి వినియోగదారులందరినీ 5Gకి మార్చడమే జియో లక్ష్యమన్నారు. అలాగే జియో ఎయిర్‌ఫైబర్ ద్వారా ఇప్పటికే కోటి 30 లక్షల ఇళ్లకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ఇచ్చారు. ప్రతిరోజూ దాదాపు 60వేల కొత్త ఇళ్లు జియో ఎయిర్‌ఫైబర్ నెట్‌వర్క్‌లో చేరుతున్నాయి. దీనితో పాటు వినియోగదారులకు స్మార్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి ఏఐ సాంకేతికతను జియో వేగంగా జోడిస్తోంది.

నేలపైనే కాకుండా, ఇప్పుడు ఆకాశం నుండి కూడా భారత్‌ను కనెక్ట్ చేసేందుకు జియో సిద్ధమైంది. ఇందులో భాగంగా సొంతంగా 'లో ఎర్త్ ఆర్బిట్' శాటిలైట్ కాన్స్టెలేషన్‌ను అభివృద్ధి చేయాలని జియో ప్లాన్ చేస్తోంది. ఒకవిధంగా ఇది స్టార్ లింక్ మాదిరిగా పనిచేసే వ్యవస్థ అనమాట. సరిహద్దు ప్రాంతాలు, గిరిజన గ్రామాలు, ద్వీపాలకు శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి దేశీయంగా గ్రౌండ్ స్టేషన్ మౌలిక సదుపాయాలను జియో నిర్మిస్తోంది. భూమిపై సృష్టించిన డిజిటల్ సంచలనాన్ని ఇకపై అంతరిక్షంలోనూ రిపీట్ చేసేందుకు జియో అడుగులు వేస్తోంది.