హైటెక్స్‌‌లో ఇండస్ ​ఫుడ్​ 2023 షో షురూ

హైటెక్స్‌‌లో ఇండస్ ​ఫుడ్​ 2023 షో షురూ

హైదరాబాద్, వెలుగు: దక్షిణాసియాలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఫుడ్​ అండ్ బేవరేజెస్​ ట్రేడ్ షో   ‘ఇండస్‌‌‌‌ ఫుడ్ 2023’  హైదరాబాద్‌‌లో ఆదివారం ఉదయం హైటెక్స్‌‌లో ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి రాజేష్ అగర్వాల్,  భారత ప్రభుత్వ వాణిజ్య & పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ శ్రీకర్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్​రంజన్​ ప్రారంభించారు.  పెద్ద సంఖ్యలో ఎగ్జిబిటర్లు,  కొనుగోలుదారులతో షో సందడిగా కనిపించింది.  ట్రేడ్‌‌ ప్రమోషన్‌‌ కౌన్సిల్‌‌ ఆఫ్‌‌ ఇండియా (టీపీసీఐ) దీనిని నిర్వహిస్తున్నది.  కార్యక్రమానికి 600 లకుపైగా భారతీయ ఎగ్జిబిటర్‌‌లతో పాటు 80 కిపైగా దేశాల నుంచి 1,300 మందికి పైగా కొనుగోలుదారులు హాజరవుతున్నారు.

మూడు రోజుల ఈవెంట్‌‌లో  బిలియన్ డాలర్ల విలువైన మొత్తం వ్యాపార ఒప్పందాలు జరుగుతాయని భావిస్తున్నారు.  దాదాపు 50కి పైగా గ్లోబల్ ఫుడ్ రిటైల్ చైన్ బ్రాండ్‌‌లు,  వాటి ప్రతినిధులు ఎగ్జిబిషన్‌‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా రాజేష్‌‌ అగర్వాల్‌‌   ప్రధానోపన్యాసం చేస్తూ, గడిచిన ఆరేళ్లలో ఇండస్‌‌ షో అద్భుతంగా పురోగమించిందని, దీనికి కారణం ట్రేడ్‌‌ ప్రమోషన్‌‌ కౌన్సిల్‌‌ ఆఫ్‌‌ ఇండియా అని అన్నారు.  వ్యవసాయ ఎగుమతుల విషయంలో మనం  బాగానే ఉన్నప్పటికీ, మన నిజమైన సామర్థ్యం ఇంకా బయటపడలేదని అన్నారు. మన సాగుఎగుమతులు  ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల వరకు ఉన్నాయని, ప్రాసెస్ చేసిన ఫుడ్ కేటగిరీ ఎగుమతులలో మన  వాటా ఒకశాతం కంటే తక్కువన్నారు. దీనిని 15శాతానికి పెంచుకోవాలని అగర్వాల్​ అన్నారు.