నిరాశపరిచిన ఇన్ఫోసిస్.. రెవెన్యూ గైడెన్స్లో కోత పెట్టిన కంపెని.. క్యూ1‌‌‌‌లో ప్రాఫిట్ 8.6 శాతం డౌన్‌‌‌‌

నిరాశపరిచిన ఇన్ఫోసిస్.. రెవెన్యూ గైడెన్స్లో కోత పెట్టిన కంపెని.. క్యూ1‌‌‌‌లో ప్రాఫిట్ 8.6 శాతం డౌన్‌‌‌‌
  • క్యూ4తో  పోలిస్తే క్యూ1‌‌‌‌లో ప్రాఫిట్ 8.6 శాతం డౌన్‌‌‌‌
  • ఆదాయం రూ.48,211 కోట్లు 

న్యూఢిల్లీ:  ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌‌‌‌–జూన్ క్వార్టర్ (క్యూ1) లో   రూ. 7,769 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌‌‌‌) సాధించింది. కిందటేడాది జూన్ క్వార్టర్‌‌‌‌ (క్యూ1)‌‌‌‌లో వచ్చిన  రూ. 6,921 కోట్లతో పోలిస్తే ఇది  12 శాతం ఎక్కువ. కానీ, ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌‌‌‌ (క్యూ4)‌‌‌‌లో వచ్చిన రూ.8,501 కోట్లతో పోలిస్తే 8.6 శాతం తగ్గింది.  క్యూ1లో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం (రెవెన్యూ)  14 శాతం వృద్ధి చెంది రూ. 48,211 కోట్లకు చేరగా, మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 3.9 శాతం పెరిగింది.  

డాలర్ రూపంలో ఇన్ఫోసిస్ రాబడి 3శాతం పెరిగి 5.08 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఆపరేటింగ్ లాభం (ఇబిటా) 15శాతం పెరిగి రూ. 10,163 కోట్లకు చేరగా, ఆపరేటింగ్ మార్జిన్ 21.1 శాతంగా నమోదైంది. క్యూ1లో  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సేవల ద్వారా వచ్చిన రెవెన్యూ మొత్తం ఆదాయంలో  8.2శాతం వాటాను కలిగి ఉండటం గమనార్హం. కంపెనీ 3.6 బిలియన్ డాలర్ల విలువైన భారీ డీల్స్‌‌‌‌ను సాధించింది.

తగ్గనున్న  ఆదాయ వృద్ధి 

ఇన్ఫోసిస్ తమ ఆదాయ అంచనాలను తగ్గించింది.  మొత్తం ఆర్థిక సంవత్సరానికి (2026–27) గాను స్థిరమైన కరెన్సీ వద్ద  ఆదాయ వృద్ధి 1.5శాతం–- 3శాతం మధ్య ఉంటుందని ప్రకటించింది. గతంలో 3.5 శాతం వరకు వృద్ధి ఉంటుందని అంచనా వేసింది.   క్లయింట్ల ఐటీ ఖర్చులు తగ్గడం,  ఐటీ రంగంలో మందగమనం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ  ఆపరేటింగ్ మార్జిన్ (రాబడి నుంచి ఖర్చులు తీసేయగా)  ఔట్‌‌‌‌లుక్‌‌‌‌  20-–22శాతం మధ్య  ఉంటుందని  ధీమా వ్యక్తం చేసింది. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  నుంచి ఆదాయం వస్తోందని కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ అన్నారు. 'ఇన్ఫోసిస్ టోపాజ్'పై క్లయింట్లకు నమ్మకం పెరిగిందని తెలిపారు.  కంపెనీ పెద్ద డీల్స్‌‌‌‌ సాధించడంలో  టోపాజ్‌‌‌‌ కీలకంగా ఉందని అన్నారు.  మరోవైపు  ఇన్ఫోసిస్ ఆదాయంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ (27.9శాతం), మాన్యుఫ్యాక్చరింగ్ (15.9శాతం) ,  లైఫ్ సైన్సెస్ విభాగం ( 8 శాతం) కీలక పాత్ర పోషించాయి.  

జూన్ చివరి నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,28,062 గా ఉంది.   అట్రిషన్ రేట్‌‌‌‌ (స్వచ్ఛందంగా జాబ్ మానేయడం ) రేటు  స్వల్పంగా పెరిగి 13 శాతానికి చేరింది. యూఎస్ మార్కెట్‌‌‌‌లో ట్రేడవుతున్న ఇన్ఫోసిస్ ఏడీఆర్‌‌‌‌‌‌‌‌లు గురువారం రాత్రి 4 శాతానికి పైగా నష్టపోయాయి. కంపెనీ తన రెవెన్యూ గైడెన్స్‌‌‌‌కు కోత పెట్టడంతో  ఏడీఆర్‌‌‌‌‌‌‌‌లు పడుతున్నాయి. ఇండియా స్టాక్ మార్కెట్‌‌‌‌లో ఇన్ఫోసిస్ షేర్లు గురువారం 0.45 శాతం తగ్గి రూ.1,047 వద్ద ముగిశాయి. 

కొత్త సీఈఓ  ఆశిష్‌‌‌‌ కుమార్ దాస్‌‌‌‌

ఇన్ఫోసిస్ తమ కొత్త సీఈఓగా ఆశిష్  కుమార్ దాస్‌‌‌‌ను నియమించింది.  ఆయన  మార్చి 2027 వరకు డిసిగ్నేట్‌‌‌‌ సీఈఓగా  పని చేస్తారు.  2027 ఏప్రిల్ నుంచి ప్రస్తుత సీఈఓ సలీల్ పరేఖ్ స్థానంలో  మేనేజింగ్ డైరెక్టర్,  సీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆశిష్ కుమార్‌‌‌‌‌‌‌‌  ఇన్ఫోసిస్‌‌‌‌లో గ్లోబల్ హెడ్‌‌‌‌గా పనిచేస్తున్నారు. కంపెనీలో ఆయనకు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది.