- రూ.7,032 కోట్లతో 25 పనులు చేపట్టే ప్లాన్
- స్పీడప్ చేయని జీహెచ్ఎంసీ టెండర్లు పిలిచినా
- ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు
- టెండర్లు పూర్తయిన వాటికి అగ్రిమెంట్ చేయని బల్దియా
హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్ లో హెచ్-సిటీ(హైదరాబాద్ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫర్మేటివ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్) పనులు స్పీడ్‌గా జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా మొదలు కావడంలేదు. 6 నెలల క్రితం హెచ్ సిటీ పనులను సీఎం రేవంత్‌రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. హెచ్ సిటీ కింద రూ.7,032 కోట్లతో 25 పనులు చేపట్టగా ఇందులో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, ఆర్ఓబీలు ఉన్నాయి. మరో 13 పనులు రోడ్డు విస్తరణకి సంబంధించినవి. సీఎం ప్రారంభించిన తర్వాత పనులు స్పీడప్ అవుతాయని అనుకున్నా అది ఎక్కడా కనిపించడం లేదు.
కొన్ని పనులకు టెండర్లు పిలిచే విషయంలో బల్దియా ఆలస్యం చేస్తుండగా, మరికొన్ని పనులకు టెండర్లు వేసినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని తెలిసింది. ఏఓసీ(ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్) సెంటర్ ఆల్టర్నేట్రోడ్ల నిర్మాణానికి హెచ్ సిటీలో భాగంగా రూ.307.74 కోట్లతో బల్దియా టెండర్లు ఆహ్వానించింది. గత నెల 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. అయినా, ఒక్కరు కూడా బిడ్లు దాఖలు చేయలేదు. బిల్లులు ఆలస్యమవుతున్నాయని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తమకు తెలిసిందని అధికారులు అంటున్నారు. అయితే, వారితో ప్రీ బిడ్ మీటింగ్ ఏర్పాటు చేసి బిల్లుల విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిఉన్నప్పటికి ఆ విషయాన్ని పట్టించుకోవడంలేదు. నిధులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా పనులు స్పీడప్ చేయడంతో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియడం లేదు.
టెండర్లు పూర్తయిన పనులు షురూ కానివి ఇవే..
హెచ్ సిటీ కింద రోడ్డు వైడెనింగ్ పనుల కోసం ఓల్డ్ సిటీలో రూ.60 కోట్లతో టెండర్లు పిలిచి రెండు నెలలైంది. మొదటి కాల్ కి ఎవరు స్పందించకపోవడంతో సెకండ్ కాల్ చేయగా సుధాకర్ ఇన్ ఫ్రా ఏజెన్సీ దక్కించుకుంది.ఈ ఏజెన్సీతో అగ్రిమెంట్ చేసుకునే విషయంలో కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ట్రిపుల్ఐటీ జంక్షన్ ఫ్లైఓవర్, అండర్ పాస్, ఖాజాగూడ జంక్షన్ ఫ్లైఓవర్, అండర్ పాస్ జంక్షన్, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2 లో ఫ్లైఓవర్ టెండర్లు పూర్తయ్యాయి. అయినా నేటికీ అగ్రిమెంట్ చేసుకోలేదు..అలాగే రేతిబౌలి, నానల్ నగర్ ఫ్లైఓవర్ల పనులకు ఎప్పుడో టెండర్లు వేయాల్సి ఉండగా ఈ మధ్యే వేశారు. ఓల్డ్ సిటీలో నాలుగు ఫ్లైఓవర్లకు సంబంధించి టెండర్లు పూర్తయి రెండునెలలైన అగ్రిమెంట్ చేసుకోవడం లేదు.
పనులు వెంటనే చేపట్టాలె: కమిషనర్ హెచ్ సిటీ పనులు, స్ట్రాటజిక్నాలా డెవలప్ మెంట్ ప్రొగ్రాం పనుల ఆలస్యంపై కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులపై సిరీయస్ అయ్యారు. మంగళవారం బల్దియా హెడ్ ఆఫీస్‌లో కమిషనర్ అన్ని జోన్లలో చేపడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎస్ఎన్డీపీ పనులపై జోనల్ కమిషనర్లు, ప్రాజెక్ట్స్ ఇంజినీర్లు , ప్లానింగ్, భూ సేకరణ ఆఫీసర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్అధికారులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఒక్కో ప్రాజెక్ట్ పురోగతిని కమిషనర్ కు వివరించారు. ఫీల్డ్లెవెల్లో ఎదురవుతున్న సవాళ్లు, పెండింగ్ పనులు, కారణాలను తెలియజేశారు. దీంతో కమిషనర్మాట్లాడుతూ ప్రాజెక్టుల పూర్తికి నిధుల కొరత లేదని, యుటిలిటీ షిఫ్టింగ్, పెండింగ్ భూసేకరణ స్పీడప్చేయాలన్నారు. జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి , బోర్కడే హేమంత్ సహదేవ్ రావు, హేమంత్ కేశవ్ పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, రవి కిరణ్, ప్రాజెక్ట్స్ చీఫ్ ఇంజినీర్ భాస్కర్ రెడ్డి, చీఫ్ ఇంజినీర్ జోతిర్మయి, చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
