- అన్ని ఫైళ్లను పరిశీలించిన టెక్నికల్కమిటీ సభ్యులు
- 7 గంటలకు పైగా గోప్యంగా విచారణ
హైదరాబాద్, వెలుగు: సింగరేణి నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంపై విచారణ మొదలైంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం ఇద్దరు సభ్యులతో కూడిన టెక్నికల్ కమిటీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ రెడ్‌హిల్స్ ఏరియాలోని సింగరేణి ప్రధాన కార్యాలయానికి చేరుకున్నది. కేంద్ర బొగ్గు గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతన శుక్లా, డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు ఉదయం 10.30 గంటలకు ఆఫీస్‌కు వచ్చి.. రాత్రి 6 గంటల వరకు గోప్యంగా విచారణ చేపట్టారు.
సింగరేణి సీఎండీ కృష్ణ భాస్కర్, ప్రాజెక్టు, ప్లానింగ్ డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు, ఆపరేషన్ డైరెక్టర్ ఎల్వీ సూర్యనారాయణ, ఈ అండ్ఎం డైరెక్టర్ తిరుమలరావు, డైరెక్టర్ పా గౌతమ్ పొట్రు తదితరులు కమిటీ సభ్యులకు కావాల్సిన ఫైల్స్‌తోపాటు అడిగిన సమాచారం అందించినట్లు తెలిసింది.
సీఎస్ఆర్ ఫండ్స్వినియోగంపై వివరాలు ఆరా
నైనీ బొగ్గు బ్లాక్ టెండర్ల రద్దు అంశంతోపాటు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఖర్చు చేసిన సీఎస్ఆర్ ఫండ్స్ఫై కేంద్ర కమిటీ వివరాలు సేకరించినట్లు తెలిసింది. ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాక్‌ను సింగరేణి సంస్థకు ఎప్పుడు కేటాయించారు? అప్పటినుంచి ఇప్పటి వరకు అక్కడ ఏయే కార్యక్రమాలు చేపట్టారు? ఇప్పటిదాకా ఎంత ఖర్చు చేశారు? లాంటి వివరాలు రాబట్టినట్టు సమాచారం.
అలాగే, నైనీ వద్ద బొగ్గు గని అభివృద్ధి, నిర్వహణ, ఆపరేటర్(ఎండీఓ) ఎంపిక కోసం 2025 నవంబరు 28న జారీ చేసిన టెండరు ప్రకటన, అందులో ఉన్న అంశాలు, ఆ టెండర్ రద్దు చేయడానికి గల కారణాలు, రద్దుకు దారితీసిన పరిస్థితులకు సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్స్‌ను సింగరేణి సంస్థ నుంచి ఎంక్వైరీ కమిటీ సభ్యులు తీసుకున్నట్లు తెలిసింది.
నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లలో సైట్విజిట్ నిబంధనపైనే సింగరేణి ఆఫీసర్లను కమిటీ సభ్యులు ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. అసలు ఈ నిబంధన ఎందుకు పెట్టారు? కోల్ ఇండియా, మహానది కోల్ ఫీల్డ్స్‌లాంటి అన్ని బొగ్గు కంపెనీల్లో ఇలాంటి నిబంధన అమల్లో ఉందా? అనేదానిపై ఆరా తీశారు. అలాగే, నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లకు సంబంధించి ఇప్పటివరకూ ఎన్ని కంపెనీలకు ‘సైట్విజిట్’ సర్టిఫికెట్ జారీ చేశారనే వివరాలు రాబట్టినట్లు తెలిసింది.
సీఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడ ఖర్చు పెట్టారు?
సింగరేణి సీఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ఆరా తీసిన అధికారులు.. అందుకు సంబంధించిన అఫీషియల్ లెటర్స్‌ను తీసుకున్నట్లు తెలిసింది. సీఎస్ఆర్ ఫండ్స్ దుర్వినియోగం అయినట్లు ఇటీవల పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం రూ.10 కోట్లకు పైగా ఈ ఫండ్స్ వినియోగించినట్లుగా ప్రచారం జరిగింది.
దీంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు సింగరేణితో సంబంధం లేని ఏరియాలు, తమకు నచ్చినచోట సీఎస్‌ఆర్ నిధులు వినియోగించినట్లుగా కంప్లైంట్స్ వచ్చాయి. సీఎస్‌ఆర్ ఫండ్స్‌పై కూడా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆదేశించడంతో ఎంక్వైరీ కమిటీ సభ్యులు.. ఆ నిధుల మంజూరు, ఖర్చులకు సంబంధించిన అన్ని అఫీషియల్ లెటర్స్ తమకు అందించాలని ఆదేశించారు.
దీంతో రాష్ట్రంలోని అన్ని సింగరేణి ఏరియాల నుంచి తెప్పించి వారికి అందించారు. ఈ ఖర్చులపై కూడా కమిటీ సభ్యులు వేసిన ప్రశ్నలకు సింగరేణి సీఎండీ, ఇతర డైరెక్టర్స్ సమాధానం ఇచ్చినట్లు సమాచారం. కాగా, శనివారం కూడా ఎంక్వైరీ జరగనున్నది. అనంతరం కమిటీ సభ్యులు సోమవారం కేంద్రానికి సమగ్రమైన నివేదిక అందించనున్నట్లు తెలిసింది.
