న్యూఢిల్లీ: దేశ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి చేపట్టిన మిసైల్ ప్రయోగం విజయవంతమైంది. శుక్రవారం రక్షణ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. న్యూక్లియర్ సబ్ మెరైన్ నుంచి మిసైల్‌ను ప్రయోగించడం ఇదే మొదటిసారని పేర్కొంది. దేశ చరిత్రలో ఇదో మైలురాయని తెలిపింది. బంగాళాఖాతం ప్రాంతంలో నిర్దేశించిన లక్ష్యాన్ని మిసైల్ అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని,టెక్నలాజికల్ పారమీటర్లను అంచనా వేయగలిగిందని ఆ శాఖ వర్గాలు చెప్పాయి. ఈ మిసైల్ ప్రయోగం ద్వారా మన దేశ నేవీ సత్తా ప్రపంచానికి తెలిసిందని, ఐఎన్ఎస్ సిబ్బంది శక్తి సామర్థ్యాలు మరోసారి నిరూపితం అయ్యాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
‘‘ఇక ఇండియన్ సబ్ మెరైన్లు నీటి నుంచే పాకిస్తాన్, చైనాలను టార్గెట్ చేసుకుంటాయి. అన్ని పరిస్థితుల్లోనూ ఐఎన్ఎస్ అరిహంత్ క్లాస్ సబ్మెరైన్లు పనిచేస్తాయని తాజా ప్రయోగం ద్వారా రుజువైంది. న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ల ద్వారా మిసైళ్లను ప్రయోగించే దేశాల్లో మన దేశం ఆరో స్థానంలో నిలిచింది” అని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన ఐఎన్ఎస్ అరిహంత్ సబ్ మెరైన్ ను 2009 జులైలో కార్గిల్ విజయ్ దివస్ రోజు ప్రారంభించారు.
