త్వరలోనే నేవీ అమ్ములపొదిలోకి ఐఎన్ఎస్ విక్రాంత్

త్వరలోనే నేవీ అమ్ములపొదిలోకి ఐఎన్ఎస్ విక్రాంత్

న్యూఢిల్లీ: మన దేశంలో సొంతంగా నిర్మించిన మొదటి విమాన వాహక నౌక (ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్) ఐఎన్ఎస్ విక్రాంత్ త్వరలోనే నేవీ అమ్ములపొదిలోకి చేరనుంది. కొచ్చిలో వచ్చే నెల 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఐఎన్ఎస్ విక్రాంత్ కమిషనింగ్ వేడుక జరగనుందని గురువారం నేవీ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ ఘోర్మడే వెల్లడించారు. ఈ షిప్ నిర్మాణం కోసం 18 రాష్ట్రాలు, యూటీల్లోని ప్రాంతాల్లో ఎక్విప్ మెంట్ ను తయారు చేశారని, హైదరాబాద్, కోల్కతా, జలంధర్, కోట, పుణే, ఢిల్లీ, అంబాలా వంటి సిటీలు ఇందులో ఉన్నాయన్నారు.

ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణంతో అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్ ల తర్వాత సొంతంగా 40 వేల టన్నులకుపైగా బరువున్న విమాన వాహక నౌకను నిర్మించుకున్న ఆరో దేశంగా ఇండియా నిలిచిందన్నారు. ప్రస్తుతం మన నేవీ వద్ద ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఒక్కటేనని, హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్నందున డ్రాగన్ కు దీటుగా నిలిచేందుకు ఈ నౌక తోడ్పడుతుందన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి పరిరక్షణకూ ఇది కీలకం కానుందన్నారు.