రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తం: రాహుల్ గాంధీ

రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తం: రాహుల్ గాంధీ

రత్లామ్ (మధ్యప్రదేశ్): కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు విధించిన 50% పరిమితిని ఎత్తేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవసరమైన మేరకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. తాము తీసుకునే చరిత్రాత్మక నిర్ణయం.. దళిత, వెనుకబడిన, గిరిజన వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో ప్రయోజనాలు పెంచుతుందని చెప్పారు. మధ్యప్రదేశ్ రత్లామ్​లో సోమవారం నిర్వహించిన లోక్​సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడారు. 

‘‘రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు రాజ్యాంగం లేకుండా చేయాలని చూస్తున్నారు. కూటమిలోని వివిధ పార్టీల నేతలంతా అదే రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్​తో పోరాడుతున్నారు. దేశంలోని ప్రతి  ఒక్కరికి రాజ్యాంగం కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించింది. జల్, జంగిల్, జమీన్​పై అన్ని వర్గాల వారికి హక్కులు ఉంటాయి. ఆ హక్కులను మోదీ లాగేసుకునేందుకు ప్రయత్నిస్తున్నడు’’ అని రాజ్యాంగ కాపీని చేతిలో పట్టుకుని రాహుల్ అన్నారు. 

ఎన్డీఏకు 150 సీట్లు కూడా రావు

కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ బీజేపీ లీడర్లు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని రాహుల్ గాంధీ అన్నారు. అందుకే 400 స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్​గా పెట్టుకున్నట్టు వివరించారు. ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు ఇబ్బందులు తప్పవని అన్నారు. ‘‘బీజేపీకి 300 సీట్లు.. కూటమికి మొత్తం 400కు పైగా స్థానాలు వస్తాయని ఆ పార్టీ నేతలు కలలు కంటున్నారు. మొత్తం 150 సీట్లు కూడా రావు. రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్నరు. నేను ఈ వేదిక నుంచి ఒకటి చెప్పదల్చుకుంటున్న.. మీరు రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తేద్దామనుకుంటున్నరు.. 

మేము రాజ్యాంగ హక్కులను కాపాడుతూ.. రిజర్వేషన్లు పెంచుతాం. సుప్రీం కోర్టు విధించిన 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తాం. పేద, వెనుకబడిన, దళితులు, ఆదివాసీలకు రిజర్వేషన్లు పెంచుతాం. అందరినీ దేశాభివృద్ధిలో భాగస్వాములను చేస్తాం’’ అని రాహుల్​ గాంధీ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తగ్గించి మైనార్టీలకు పెంచుతామంటూ మోదీ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్ల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం, మతం పేరు చెప్పుకుని ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. 

ఆదివాసీ బిడ్డలను రేప్ చేస్తున్నరు

దేశంలోని చాలా వరకు మీడియా సంస్థలు మోదీ కనుసన్నల్లోనే పని చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. బీజేపీకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ టెలికాస్ట్ చేస్తూ.. నెగిటివ్ న్యూస్​ను తొక్కిపెడ్తున్నాయని మండిపడ్డారు. ఆదివాసీ బిడ్డలపై అత్యాచారాలు జరిగితే ఆ విషయం బయటికి ప్రపంచానికి తెలియనివ్వకుండా కుట్ర చేస్తున్నారని అన్నారు. ‘ప్రభుత్వం మొత్తాన్ని కేవలం 90 మంది అధికారులే రన్ చేస్తున్నరు. ఇందులో ఒకరు ఆదివాసీ, ముగ్గురు వెనుకబడిన వర్గం, ముగ్గురు ఎస్సీ కమ్యూనిటీకి చెందినవాళ్లు ఉన్నరు. దీన్ని మేము మార్చాలనుకుంటున్నం. అందుకే కుల గణనతో పాటు సామాజిక ఆర్థిక సర్వే చేయాలనుకుంటున్నం’’ అని రాహుల్ అన్నారు.

మహిళలను లక్షాధికారులను చేస్తాం

రైతులకు రుణాలు మాఫీ చేసి పంటలకు మద్దతు ధర అందిస్తామని రాహుల్ తెలిపారు. ఉపాధి హామీ కూలీ రూ.400కు పెంచుతామన్నారు. ‘లక్​పతి స్కీమ్’ కింద ప్రతి మహిళ అకౌంట్​లో రూ. లక్ష జమ చేసి వారిని లక్షాధికారులను చేస్తామన్నా రు. ‘పెహ్లీ నౌకరీ పక్కీ’ స్కీమ్ కింద యువతకు కంపెనీల్లో ఏడాది పాటు అప్రెంటిస్​షిప్ అందిస్తామని, తర్వాత ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు.