
బెంగళూరు: ప్రధానిని అసభ్యకరమైన పదాలతో తిట్టడం అభ్యంతరకరం, బాధ్యతారాహిత్యమే.. దేశద్రోహం మాత్రం కాదని కర్నాటక హైకోర్టు స్పష్టంచేసింది. ఈమేరకు ఓ స్కూల్ మేనేజ్ మెంట్ పై దాఖలైన కేసును హైకోర్టు కొట్టివేసింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ పౌరసత్వ రిజిస్ట్రార్(ఎన్ఆర్సీ)ను వ్యతిరేకిస్తూ 2020 జనవరి 6, 21న బీదర్‌లోని షహీన్ స్కూల్లో పిల్లలతో డ్రామా ఆడించారు.
ఈ సందర్భంగా ప్రధానిని చెప్పుతో కొట్టాలంటూ మాట్లాడించారు. దీనిపై ఏబీవీపీ కార్యకర్త నీలేశ్ రక్షాల ఆ స్కూల్ యాజమాన్యంపై కేసు వేశారు. ఈ కేసుపై హైకోర్టులోని కల్బర్గి బెంచ్ విచారణ జరిపింది. సెక్షన్ 153(ఏ), ఐపీసీలో పేర్కొన్న విషయాలు ఈ కేసులో లేవని బెంచ్ తెలిపింది. ‘‘ప్రధానిని చెప్పుతో కొట్టాలనడం అవమానకరమే. ప్రభుత్వ విధానాలను నిర్మాణాత్మకంగా విమర్శించవచ్చు. కానీ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని అవమానించడం సరికాదు” అని వ్యాఖ్యానించింది.