- మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: మహిళా అధికారులను కించపరిస్తే సహించేది లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ‘‘మహిళా ఐఏఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని కొంతమంది వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలు అసభ్యంగా, అనుచితంగా వ్యాఖ్యలు చేయడం, వార్తలు రాయడం దారుణం.
బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజాసేవలో నిమగ్నమైన మహిళా ఐఏఎస్ అధికారుల గౌరవాన్ని దెబ్బతీయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. మహిళలు ఉన్నత స్థాయికి చేరడం తట్టుకోలేని ఫ్యూడల్ మానసిక ప్రవర్తనే ఈ రకమైన దుష్ప్రచారాలకు మూలం. రాష్ట్రంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం పని చేస్తున్నది.
అటువంటి పరిస్థితుల్లో మహిళా అధికారులను కించపరిచే వ్యాఖ్యలను, వారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రచారాన్ని సహించేదిలేదు. మహిళా ఐఏఎస్ అధికారులు తమ బాధ్యతలను ధైర్యంగా, నిబద్ధతతో నిర్వహిస్తున్నారు. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఈ తరహా దూషణలు, అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయి” అని మంత్రి హెచ్చరించారు. ఇలాంటి దుష్ప్రచారాలను అందరూ వ్యతిరేకించాలని, మహిళల గౌరవాన్ని కాపాడాలని కోరారు.
