- అక్షాంశాలు, రేఖాంశాల వివరాలున్న మ్యాప్‌ను భూభారతిలో అప్‌లోడ్ చేయనున్న సిబ్బంది
- సర్వే పూర్తయ్యాక ప్రతి రిజిస్ట్రేషన్‌కు యూనిక్ నంబర్ కేటాయింపు
- రాష్ట్రంలోని ఐదు మండలాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా సాగుతున్న ప్రక్రియ
ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో భూముల సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేందుకు సుమారు పది రోజుల సమయం పట్టనుంది. ప్రతి రిజిస్ట్రేషన్‌కు అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన ల్యాండ్డ్ పార్సిల్ మ్యాప్‌ను జతచేసేలా కొత్త విధానాన్ని తీసుకురావడంతో డిజిటల్సర్వేకు సమయం పడుతోంది. సర్వేయర్లకు విధుల కేటాయింపు, గెట్టు రైతులకు నోటీసులు ఇవ్వడం, సర్వే పూర్తి చేసి మ్యాప్ తయారు చేయడం.. వంటి ప్రక్రియలన్నీ పూర్తయ్యాకే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది.
ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను ఈ నెల 2 నుంచి రాష్ట్రంలోని ఐదు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రంగారెడ్డి జిల్లా ఆమనగల్, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో ఈ పోర్టల్ అమల్లోకి వచ్చింది. ప్రాజెక్ట్‌లో భాగంగా ఆయా మండలాలకు లేటెస్ట్ టెక్నాలజీ గల రోవర్లను సైతం కేటాయించారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేదిలా..
భూభారతి అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్‌ను తప్పనిసరి చేసింది. కొనుగోలుదారులు స్లాట్ బుక్ చేసుకున్నాక తహసీల్దార్‌తో పాటు ఆ మండలానికి కేటాయించిన లైసెన్డ్స్ సర్వేయర్లలో ఒకరికి ర్యాండమ్‌గా సర్వే పనులు అప్పగిస్తారు. తర్వాత సర్వేకు హాజరుకావాలంటూ రిజిస్ట్రేషన్ చేయాల్సిన భూమికి చుట్టుపక్కల ఉన్న రైతుల సైతం నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత వారం రోజుల్లో తోటి రైతుల సమక్షంలో లేటెస్ట్ టెక్నాలజీ రోవర్లను ఉపయోగించి సర్వే కంప్లీట్ చేసి, ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌ను తయారుచేస్తారు.
రిజిస్ట్రేషన్ జరుగుతున్న సమయంలోనే ప్రతి భూమికి 11 అంకెలతో కూడిన భూదార్ నంబర్‌ను కేటాయించడంతో పాటు అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన మ్యాప్‌ను జత చేస్తారు. లైసెన్డ్స్ సర్వేయర్ అప్‌లోడ్ చేసిన వివరాలన్నింటినీ మండల సర్వేయర్ క్రాస్ చెక్ చేసి అప్రూవ్ చేస్తారు. ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ ప్రక్రియలో ప్రతి దశ తర్వాత దరఖాస్తుదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం ఇస్తారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు మ్యాప్, భూదార్ కార్డును జారీ చేస్తారు. దీని వల్ల భవిష్యత్‌లో సరిహద్దు సమస్యలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు.
పది రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది
ఇంటిగ్రేటెడ్ భూభారతి పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన కూసుమంచి మండలంలో రిజిస్ట్రేషన్ కోసం ఐదుగురు అప్లై చేసుకున్నారు. వీటికి సంబంధించి సర్వే ప్రక్రియ పూర్తి అయింది. ల్యాండ్ మ్యాప్ కూడా సిద్ధమైంది. ఒకట్రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ అవుతుంది. దరఖాస్తు చేసుకున్న సమయంలో చెబుతున్న సర్వే నంబర్‌కు, క్షేత్ర స్థాయిలో భూమి సర్వే నంబర్‌కు తేడాలు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ కావడం వల్ల ఇలాంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. – సైదులు, తహసీల్దార్, కూసుమంచి

