అఫిలియేషన్లు పూర్తవకుండానే అడ్మిషన్లు

అఫిలియేషన్లు పూర్తవకుండానే అడ్మిషన్లు
  • నేటి నుంచి ఇంటర్ కాలేజీల్లో ఫస్టియర్ ప్రవేశాలు 
  • ప్రైవేటులో 346, సర్కారులో 380 కాలేజీలకే గుర్తింపు 
  • మొత్తం 3 వేల కాలేజీల్లో 1524కే రికగ్నిషన్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ఇంటర్మీడియెట్  కాలేజీల్లో సోమవారం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ మొదలుకానున్నది. అయితే, కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ మాత్రం ఇంకా పూర్తికాలేదు. ఏప్రిల్​ నెలాఖరులోనే ఇంటర్​అఫిలియేషన్ల ప్రక్రియ పూర్తిచేసి, గుర్తింపు ఉన్న కాలేజీల లిస్టు ప్రకటిస్తామని వెల్లడించిన ఇంటర్  బోర్డు.. తన మాటను నిలబెట్టుకోలేదు. జూన్ 1 నుంచి ఫస్టియర్, సెకండియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం మూడువేలకు పైగా ఇంటర్మీడియెట్ కాలేజీలు ఉన్నాయి. ఆదివారం రాత్రి వరకూ 1,524 కాలేజీలకే గుర్తింపు లభించింది. వాటిలో సర్కారు కాలేజీలు 380 ఉండగా, ప్రైవేటు కాలేజీలు 346 మాత్రమే ఉన్నాయి. మిగిలినవి ఎయిడెడ్, గురుకులాలు. ఈ వివరాలను ఇంటర్  బోర్డు తన అధికారిక వెబ్ సైట్​లో ప్రకటించింది.

ప్రధానంగా ప్రైవేటు కాలేజీలకు అఫిలియేషన్ కీలకం. ఆదివారం నాటికి లెక్కలను పరిశీలిస్తే మరో వెయ్యికి పైగా ప్రైవేటు కాలేజీలకు గుర్తింపు రావాల్సి ఉంది. వాటికి గుర్తింపు వస్తుందా రాదా అనే దానిపై బోర్డు అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, జనగామ, ఖమ్మం, మెదక్, సంగారెడ్డి, జోగుళాంబ గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్, నారాయణపేట, ములుగు తదితర జిల్లాల్లో ఒక్క ప్రైవేటు కాలేజీకి కూడా ఇంకా అఫిలియేషన్ రాలేదు.

సిరిసిల్ల, భూపాలపల్లి, మహబూబాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఒక్కో కాలేజీకి గుర్తింపు ఇచ్చామని ఇంటర్  బోర్డు తన వెబ్ సైట్​లో పేర్కొన్నది. అయితే, సర్కారు కాలేజీలతో పాటు సర్కారు గురుకులాలకూ గుర్తింపు ఇవ్వడానికి ఇంటర్  బోర్డు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇదంతా  పక్కనపెట్టిన బోర్డు.. అధికారికంగా ఇంటర్​ ఫస్టియర్​లో అడ్మిషన్ల ప్రక్రియకు పర్మిషన్  ఇచ్చింది. మరోపక్క ఇప్పటికే అన్ని కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. కానీ, వాటిపై ఇంటర్  బోర్డు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. కనీసం నోటీసులూ జారీచేయకపోవడం గమనార్హం.