V6 News

బస్సు ప్రయాణికులే టార్గెట్...అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

బస్సు ప్రయాణికులే టార్గెట్...అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
  •     17 తులాల బంగారం స్వాధీనం

మెహిదీపట్నం, వెలుగు: బస్సుల్లో నిద్రిస్తున్న ప్రయాణికుల బ్యాగుల నుంచి నగలు కొట్టేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను అఫ్జల్​గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 17 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం గోల్కొండ జోన్ డీసీపీ చంద్ర మోహన్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 12న అనంతపురం నుంచి హైదరాబాద్​కు మీనా ట్రావెల్స్ బస్సులో ప్రయాణించిన డాక్టర్ డి.ఎస్. కీర్తన తన బ్యాగులోని 20 తులాల బంగారం మాయమైనట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కర్నూలు జిల్లాకు చెందిన అన్నారెడ్డి వెంకట శివారెడ్డిని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. గతంలో సూపర్ మార్కెట్ సూపర్ వైజర్ గా పనిచేసిన శివారెడ్డి.. చెడు వ్యసనాలకు బానిసై తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో గుర్తించారు.