కోల్‌బెల్ట్, వెలుగు: అటవీ, వన్యప్రాణుల సంరక్షణకు యువత సహకరించాలని మంచిర్యాల జిల్లా జడ్జి వీరయ్య అన్నారు. అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం సందర్భంగా క్యాతనపల్లి గాంధారీవనం అర్బన్ పార్క్‌లో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సైక్లింగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. అడవుల పరిరక్షణతోనే పర్యావరణ సమతుల్యత, జీవజాల మనుగడ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సైక్లింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు బరువు నియంత్రణ, కండరాల బలోపేతానికి దోహదపడుతుందని తెలిపారు. సైకిల్ వినియోగం కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణానికి మేలు చేస్తుందని చెప్పారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు సైక్లింగ్ చేయాలని సూచించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అటవీ, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.
