పద్మారావునగర్, వెలుగు: ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా గుజరాత్‌కు భారీగా గంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.9.26 లక్షల విలువైన 18.538 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సికింద్రాబాద్ అర్బన్ డీఎస్పీ ఎస్.ఎన్. జావేద్ తెలిపారు.
శుక్రవారం హైదరాబాద్(నాంపల్లి) రైల్వే స్టేషన్ నాలుగో ప్లాట్‌ఫాంపై తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న నిరంజన్ ప్రధాన్(22)ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. ఒడిశాలోని బెర్హంపూర్‌కు చెందిన దీపక్ రూ.15 వేల కూలీ ఇస్తానని చెప్పి గంజాయిని గుజరాత్‌లోని సూరత్‌కు తరలించాలని అప్పగించినట్లు నిరంజన్ ఒప్పుకున్నాడు. ఇద్దరూ కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ కు రాగా.. దీపక్ పోలీసులను చూసి పరారయ్యాడు.
