ఈ ఫొటో మీ కంట పడిందా..? వీళ్ల గురించి తెలిస్తే అంత దారుణంగా ట్రోల్ చేసి ఉండరేమో..!

ఈ ఫొటో మీ కంట పడిందా..? వీళ్ల గురించి తెలిస్తే అంత దారుణంగా ట్రోల్ చేసి ఉండరేమో..!

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫొటో మీరూ చూసే ఉంటారు. ఈ ఫొటోపై స్పందిస్తూ చాలా మంది నెటిజన్లు అవాకులుచెవాకులు పేలారు. ఈ యువకుడిని వెటకారం చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ జంటను ఉద్దేశించి అనరాని మాటలన్నారు. గవర్నమెంట్ జాబ్ మహిమ అన్నారు. డబ్బు కోసం అతనిని ఆమె పెళ్లి చేసుకుని ఉండొచ్చని విమర్శించారు. ఇంకా ఎన్నో మాటలన్నారు. ఈ స్థాయిలో ఈ జంట ట్రోల్ అవడానికి కారణం అతని రంగు. 2025లో కూడా ఒక మనిషిని కించపరిచేందుకు, వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు అతని రంగును టార్గెట్ చేస్తున్నారంటే ఈ సమాజంలో ఎంత సిగ్గుచేటు మనుషులు బతుకుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ప్రేమకు రంగు, రూపంతో పనిలేదని.. మనసులు కలిస్తే చాలని కొంతమంది మనుషులకు ఎప్పుడు అర్థమవుతుందోనని కొందరు ప్రేమికులు ఈ జంటకు మద్దతుగా నిలిచారు. ఈ ట్రోల్స్ను ఎదుర్కొన్న రిషబ్ రాజ్పుత్ హుందాగా స్పందించాడు. రిషబ్ రాజ్ పుత్, సోనాలి చౌక్సే ప్రేమించుకున్నారు. వీరిది మధ్యప్రదేశ్. 11 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. ఎన్నో కష్టనష్టాలను దాటుకుని పెళ్లి చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఇంత టాక్సిక్ మెంటాలిటీ పబ్లిక్ ఉంటారని తెలియక పొరపాటున తమ పెళ్లి ఫొటోలను, వీడియోను పోస్ట్ చేశారు.

ఇంకేముంది.. వీళ్ల ఫొటోను మీమ్ పేజ్లు ట్రోల్ మెటీరియల్గా మార్చేశాయి. ఈ విమర్శలపై రిషబ్ రాజ్ అదే సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. తన వయసు 30 సంవత్సరాలని.. నిజంగానే నల్లగానే ఉన్నానని.. ఈ నిజాన్ని కాదనలేనని చెప్పాడు. తన జీవితంలో ఇప్పటిదాకా ఇలా ఎన్నో సార్లు వివక్ష అనుభవించానని.. తనకు ఇది కొత్తేం కాదని తెలిపాడు. నల్లగా ఉన్న ఒక సామాన్య యువకుడినే కావచ్చు గానీ తన భార్య కోరుకునే ఉత్తమ భర్తగా జీవితాంతం ఉంటానని రిషబ్ చెప్పాడు. తనకు గవర్నమెంట్ జాబ్ ఏం లేదని.. తన కుటుంబం వ్యాపార రంగంలో ఉందని.. వ్యాపారం చూసుకుంటానని రిషబ్ రాజ్పుత్ పోస్ట్ చేశాడు.