సూర్యాపేట: బస్సు ప్రయాణికులే లక్ష్యంగా ఫోన్ల చోరీ.. 

సూర్యాపేట: బస్సు ప్రయాణికులే లక్ష్యంగా ఫోన్ల చోరీ.. 
  •    మనీ యాప్స్ ద్వారా నగదు కాజేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

సూర్యాపేట, వెలుగు:  బస్సుల్లో ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని మొబైల్ ఫోన్లు దొంగిలిస్తూ, గూగుల్ పే, ఫోన్ పే వంటి మనీ యాప్స్ ద్వారా బ్యాంక్ ఖాతాల నుంచి సొమ్మును కాజేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సూర్యాపేట జిల్లా సీసీఎస్, తుంగతుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ నరసింహ మీడియాతో మాట్లాడారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన రైతు ఉప్పల ఉప్పలయ్య ఖాతా నుంచి రూ. 1.80 లక్షలు, వ్యాపారి దుగ్యాల వెంకటేశ్వరరావు ఖాతా నుంచి రూ. 97,800 చొప్పున మొత్తం రూ. 2.77 లక్షలను ఈ ముఠా మనీ యాప్స్ ద్వారా ఇతర అకౌంట్లకు బదిలీ చేసి డ్రా చేసింది.

బాధితుల ఫిర్యాదు మేరకు ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, తుంగతుర్తి బస్టాండ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పదంగా ఉన్న స్విఫ్ట్ డిజైర్ కారును ఆపి ఏపీకి చెందిన ప్రధాన నిందితుడు ఎరుకల రాముతో పాటు ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు బస్సుల రద్దీని ఆసరాగా చేసుకుని ఫోన్లు దొంగిలించి, బాధితులు పెట్టుకున్న సులభమైన యూపీఐ పిన్ నంబర్లను ఛేదించి పెట్రోల్ బంకులు, బట్టల దుకాణాలకు డబ్బులు బదిలీ చేసి వారి నుంచి నగదు తీసుకునేవారని ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ. 2.70 లక్షల నగదు, 27 స్మార్ట్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ ప్రసన్న కుమార్, సీసీఎస్ ఇన్‌‌స్పెక్టర్ శివకుమార్, తుంగతుర్తి ఎస్సై  క్రాంతి కుమార్, టెక్నికల్ టీమ్ సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులను అందజేశారు.