ప్రెస్​క్లబ్​లో ఐఎన్టీయూసీ నేతల కొట్లాట

ప్రెస్​క్లబ్​లో ఐఎన్టీయూసీ నేతల కొట్లాట

బషీర్​బాగ్, వెలుగు: సిటీలో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ( ఐఎన్టీయూసీ) నాయకుల మధ్య గొడవ జరిగింది. ఐఎన్టీయూసీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి చాలా రోజులుగా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.  బషీర్ బాగ్​ ప్రెస్ క్లబ్​లో సోమవారం ఐఎన్టీయూసీ(ఆర్) నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ నిర్వహించగా,  ఐఎన్టీయూసీ సంజీవ రెడ్డి వర్గం అడ్డుకొని, దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

విషయం తెలుసుకున్న అబిడ్స్ పోలీసులు జోక్యం చేసుకొని, సంజీవరెడ్డి వర్గీయులు చంద్రశేఖర్, ఆదిల్ షరీఫ్, నరసింహారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై అబిడ్స్ పోలీసులకు కృష్ణమూర్తి ఫిర్యాదు చేశారు. అనంతరం కొనసాగిన  సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనపై దాడిని కార్మిక వర్గంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. భౌతిక దాడులతో కార్మికులపై పెత్తనం చేయాలనుకుంటే సాధ్యం కాదని హెచ్చరించారు.

గతంలో జరిగిన ఐఎన్టీయూసీ జాతీయ మహాసభలు, కార్యకలాపాలు, యూనియన్ చరిత్రపై అవగాహన లేని ఐఎన్టీయూసీ నేతగా చెప్పుకుంటున్న బి.జనక్ ప్రసాద్ బృందం తనపై అవినీతి ఆరోపణలు చేయడం, జి.సంజీవ్ రెడ్డి అనుచరులు భౌతిక దాడులకు పాల్పడడం గర్హనీయమన్నారు. తమ ఐఎన్టీయూసీ(ఆర్) తో జి.సంజీవ్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జాతీయ కార్యదర్శి బి.అమర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్.నాగరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడ ఐలయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు అప్పారావు, గురువారెడ్డి, కృష్ణా గౌడ్, లలిత, అరుణ పాల్గొన్నారు.