V6 News

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ మ్యాచుల్లో టాస్ విన్నరెవరో చెప్తం..గెలిచే జట్టు గుట్టు విప్పేస్తం... సోషల్ మీడియాలో ముఠాల దందా

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ మ్యాచుల్లో టాస్ విన్నరెవరో చెప్తం..గెలిచే జట్టు గుట్టు విప్పేస్తం... సోషల్ మీడియాలో ముఠాల దందా
  • ముందే టాస్, మ్యాచ్ ఎవరు గెలుస్తరో చెప్తరట  
  • ఫేస్​బుక్, ఇన్​స్టాలో, యూట్యూబ్​ రీల్స్​లో ప్రచారం    
  • రూ.2 వేల వరకు సబ్​స్క్రిప్షన్ ఫీజు  
  • వాట్సాప్, టెలీగ్రామ్​లో అన్ని వివరాలు షేర్​ చేస్తరు  
  • బెట్టింగ్​లు పెట్టి నష్టపోతున్న అత్యాశాపరులు

హైదరాబాద్ సిటీ, వెలుగు : ‘ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ మ్యాచుల్లో టాస్​ఎవరు గెలుస్తారో ముందే చెప్తం.. మ్యాచ్ ప్రారంభం కాకముందే గెలిచేవాళ్లెవరో రివీల్​చేస్తం. మా ప్రిడిక్షన్​100 శాతం నిజమైతది.. జస్ట్​రూ.వెయ్యి కడితే చాలు.. వారం రోజుల పాటు అన్ని వివరాలు పక్కాగా రివీల్​చేస్తం.. దీంతో బెట్టింగ్​లో లక్షలు సంపాదించొచ్చు’ అంటూ నగరంలో కొన్ని ముఠాలు అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్, యూట్యూబ్​రీల్స్​లో ఈ తరహా ప్రచారంతో ఊదరగొడుతున్నాయి. వీళ్ల ప్రిడిక్షన్​ను నమ్ముతున్న అమాయక జనాలు ఈజీ మనీ మీద ఆశతో లక్షలకు లక్షలు బెట్టింగ్​పెట్టి నష్టపోతున్నారు. కొందరు డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 

టాస్, మ్యాచ్​, సెక్షన్​..

‘ఐపీఎల్ మ్యాచ్​ప్రిడిక్షన్’ చేసే గ్యాంగ్​లు టాస్, మ్యాచ్, సెక్షన్ అనే మూడు విభాగాల్లో డిటెయిల్స్​షేర్​చేస్తున్నారు. క్రికెట్​మ్యాచ్ లు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 7.30 గంటలకు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం మూడున్నరకు స్టార్టవుతున్నాయి. అయితే, టాస్​ఎవరు గెలుస్తారన్నది వీళ్లు మధ్యాహ్నం12 గంటలకే వాట్సాప్​గ్రూపుల్లో రివీల్​చేస్తున్నారు. మ్యాచ్​లో విజేత ఎవరో కూడా ముందే చెప్తున్నారు. ఇందులో భాగంగా వీళ్లు మైండ్​గేమ్​ఆడుతున్నారు. ఏ జట్టు బలమైనదో తెలుసుకాబట్టి అదే గెలుస్తుందని జోస్యం చెప్తున్నారు.

టాస్, మ్యాచ్​గెలిచే విషయాల్లో నిజమయ్యే సంభావ్యత 50 శాతం కావడంతో తప్పు జరిగినప్పుడు ఏదో చెప్పి మ్యానేజ్​చేస్తున్నారు. ఇక కష్టతరమైన సెక్షన్​గురించి కూడా చెప్పేస్తున్నారు. సెక్షన్​అంటే ఏ ఓవర్ లో ఎన్ని రన్స్ చేస్తారో చెప్పడం.. ఉదాహరణకు ఆరు ఓవర్ల పవర్ ప్లేలో మొదట బ్యాటింగ్ చేసే జట్టు తాము చెప్పిన రన్స్​చేస్తుందని, కావాలంటే బెట్టింగ్ పెట్టుకోవాలని ఎంకరేజ్​చేస్తున్నారు. దీంతో చాలా మంది వీరి ప్రిడిక్షన్ ను నమ్మి రెండింతలు డబ్బులు వస్తాయని లక్షల్లో మోసపోతున్నారు. అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెట్టి టాస్‌‌‌‌‌‌‌‌, మ్యాచ్, సెక్షన్లపై లక్షలు పెడుతూ నిమిషాల్లోనే బికార్లుగా మారుతున్నారు. 

మ్యాచ్​లు ముందే ఫిక్స్​ అవుతాయట..

సాధారణంగా ఏ క్రికెట్​మ్యాచ్​ఫలితం ముందే  ఎవరికీ తెలియదు. అలా తెలిస్తే ఏ ఫ్యాన్ కూడా ఆసక్తి చూపడు. ఈ విషయం అందరికీ తెలిసినా కొన్ని ప్రిడిక్షన్​ముఠాలు తమకు ఏజెన్సీల నుంచి పక్కా సమాచారం వస్తుందని నమ్మించి వంచిస్తున్నారు. తాము రోజూ రూ.60 వేలు ఫీజు కింద ఏజెన్సీలకు కడతామని, వారు కోట్లలో చెల్లించి ఐపీఎల్​మ్యాచ్​లను ప్రభావితం చేస్తారని తమకు కాంటాక్ట్​అయిన కస్టమర్లను నమ్మబలుకుతున్నారు.

అయితే, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తాము 10 మ్యాచుల్లో దాదాపు 9 కరెక్ట్ చెప్తామని, ఒక్కటి మాత్రం తప్పు చెప్తామంటున్నారు. తమ ప్రిడిక్షన్​తో రోజూ రూ. లక్షలు సంపాదించేవారు ఉన్నారని, కావాలంటే వారి కాంటాక్ట్​నంబర్​ఇస్తామని మాట్లాడాలని సూచిస్తున్నారు. ఇంకొన్ని ప్రిడిక్షన్​ముఠాలైతే ‘ఐపీఎల్​లక్షల కోట్ల బిజినెస్​తో కూడుకున్నదని, మ్యాచ్​లన్నీ ఫిక్స్​అవుతాయని, అందుకే...తమకు టాస్, మ్యాచ్, సెక్షన్ ముందే తెలుస్తుందని అంటున్నారు. 

సోషల్ మీడియాలో పబ్లిసిటీ..

ప్రిడిక్షన్​ముఠాలు కస్టమర్లను సంపాదించడానికి ప్రచారం మామూలుగా చేయడం లేదు. ప్రతి ఒక్కరినీ రీచ్​కావడానికి ఫేస్ బుక్, ఇన్ స్టా, యూట్యూబ్​రీల్స్​ను ఉపయోగించుకుంటున్నారు. కొందరు బయటి ప్రపంచానికి కనిపించకుండా ఉండేందుకు మాస్కులు, సూపర్​మ్యాన్​వేషధారణల్లో కనిపించి తమ ప్రిడిక్షన్​ప్రచారం చేసుకుంటున్నారు. జోకర్​గా, స్పైడర్​మాన్ గా, చిలుక జ్యోతిష్యం చెప్పేవాళ్లలా, క్షుద్రపూజలు చేసి జరగబోయే మ్యాచ్​ఫలితాన్ని ముందే చెప్పేస్తామని పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారు. ఇంకొందరైతే అమెరికన్​ప్రెసిడెంట్​ట్రంప్​వేషంలో ఐపీఎల్​ప్రిడిక్షన్​ఇస్తున్నారు. నోటీస్​బోర్డుపై మ్యాచ్​విన్నర్​, టాస్​విన్నర్, ఏ జట్టు ఎంత స్కోర్​చేస్తుంది రాసి దాని పక్కన ఫలితాలపై పేపర్లు అంటించి ఒక్కొక్కటి తీస్తూ రివీల్​చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. వీరు చెప్పిన దాంట్లో నిజమైనవాటినే సోషల్​మీడియాలో పెడుతున్నారు. 

అంచనా మాత్రమే...

ప్రిడిక్షన్​ముఠాలు తమకు ఏజెన్సీలు ఉంటాయని, వారు మ్యాచ్​లను ఫిక్స్​చేసే స్థాయిలో ఉంటారని చెప్తున్నా అసలు నిజం అది కాదు. స్థానిక లెవెల్​లో ప్రిడిక్షన్​తీసుకునే వారు అంతర్జాతీయ స్థాయిలో ప్రిడిక్షన్​చేసే వారితో జట్టు కడతారు. అక్కడివారు డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, క్రికెట్​ఎక్స్​పర్ట్​లపై ఆధారపడతారు. వీరు వేల మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల డేటాను కంప్యూటర్లలో ఫీడ్​చేసి ఏఐ ద్వారా అల్గారిథమ్స్ తో ఏ జట్టు గెలుస్తుందో ఒక అంచనాకు వస్తారు. మరోవైపు డేటా ఎనలిస్టులు ప్రతి బంతిని ట్రాక్ చేస్తారు. ఒక బ్యాటర్ ఏ బౌలర్‌‌‌‌‌‌‌‌కి ఇబ్బంది పడుతున్నాడు? ఏ స్టేడియం చిన్నగా ఉంది? ఏది పెద్దగా ఉంది? ఏ స్టేడియంలో ఎక్కువ రన్స్​వస్తాయి? వంటి అంశాలను చూస్తారు. 

గతంలో ఆ రెండు జట్లు తలపడినప్పుడు ఎవరు పైచేయి సాధించారు? పిచ్, వాతావరణం, స్పిన్నర్లకు అనుకూలమా లేదా పేసర్లకా? వాతావరణం వల్ల తేమ వస్తుందా? అన్నది గమనిస్తారు. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ ను, మ్యాచ్​జరిగే వేదికపై వారి రికార్డులను పరిశీలిస్తారు. సొంత గ్రౌండ్​లో ఆడే జట్లకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో వీరి ప్రిడిక్షన్స్​నిజమయ్యే అవకాశాలుంటాయి.

చాలా రీసెర్చ్​ల ప్రకారం వీరి ప్రిడిక్షన్​ కేవలం 60 నుంచి 70 శాతం వరకు మాత్రమే నిజమయ్యే అవకాశం ఉందని తేలింది. అయితే, క్రికెట్​లాంటి గేమ్​లో లాస్ట్​బాల్​వరకు ఫలితం తేలకుండా ఉత్కంఠగా సాగుతాయి. ఒక్క పరుగు తేడాతో ఓడిపోయి కప్పులు పోగొట్టుకున్న జట్లు ఎన్నో ఉన్నాయి.  అలాంటి క్రికెట్​ఆటపై ప్రిడిక్షన్​ఆధారంగా బెట్టింగ్​పెడితే నష్టపోయే అవకాశాలే ఎక్కువ...అదే ఇప్పుడు మన దగ్గరా జరుగుతోంది. పోలీసులు దీనిపై స్పందించి సీరియస్​యాక్షన్​తీసుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు కోరుతున్నారు. 

ప్రాణాలు తీస్కుంటున్నరు

మన రాష్ట్రంలో క్రికెట్​బెట్టింగ్​పెట్టి నష్టపోయి చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. 2023 నుంచి  2026 ఫిబ్రవరి నెల వరకు సుమారు 51 మంది బెట్టింగ్​పెట్టి అప్పుల పాలై బలవన్మరణాలకు పాల్పడ్డారు. గత నెల మియాపూర్​కు చెందిన పాపయ్య క్రికెట్​బెట్టింగ్​తో లాస్​అయి అప్పులపాలై తీర్చేదారి లేక ఊరేసుకున్నాడు. గత ఏడాది ఏప్రిల్​నెలలో నగరానికి చెందిన ఓ ఎంటెక్​స్టూడెంట్​₹2.65 లక్షలు నష్టపోయి హాస్టల్ లోనే తనువు చాలించాడు.

నిరుడు మార్చిలోనే ₹3 లక్షలు పోగొట్టుకున్న సోమేష్ అనే ప్రైవేట్ ఉద్యోగి రైల్వే ట్రాక్‌‌‌‌‌‌‌‌పై పడుకుని ప్రాణాలు తీసుకున్నాడు. బాధితుల్లో 80 శాతం మంది 18 నుంచి 35 ఏండ్ల లోపు వాళ్లే కావడం ఆందోళన కలిగించే అంశం. వీరంతా ప్రిడిక్షన్​ను నమ్ముకునే మోసపోయారు. బెట్టింగ్​ను నివారించేందుకు పోలీసులు కష్టపడుతన్నా అంతగా ఫలితాలు కనిపించడం లేదు. 2023- నుంచి ఈ ఏడాది వరకు రాష్ట్రంలో 1,456 కేసులు నమోదు చేయగా, దొరకని వారు ఎంతో మంది ఉన్నారు.