మాపై జరిగిన నేరాలను మర్చిపోం: బఘేయీ
టెహ్రాన్: పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు ‘పీస్ డీల్’ కుదిరిందని ఇరాన్ వెల్లడించింది. ఈ తాత్కాలిక ఒప్పందం ద్వారా లెబనాన్‌తో సహా అన్ని సరిహద్దుల్లో జరుగుతున్న యుద్ధం పూర్తిగా ముగిసిపోతుందని అధికారికంగా తెలిపింది. అమెరికా నేవీ బ్లాకేడ్ ఎత్తివేతతో పాటు హార్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని వివరించింది. అణు కార్యక్రమ నియంత్రణ, తమ దేశంపై విధించిన అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షల ఎత్తివేతపై తదుపరి చర్చలు కొనసాగుతాయని తెలిపింది.
కాగా, ఒప్పందం కుదిరినంత మాత్రాన మాదేశంపై జరిగిన నేరాలను, మా ప్రజలకు జరిగిన అన్యాయాలను మర్చిపోయినట్లు కాదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయీ పేర్కొన్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం జరిగేలా, వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఇరాన్‌పై జరిగిన ఈ దారుణమైన నేరాలను డాక్యుమెంట్ చేయడానికి, రికార్డు చేయడానికే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా వీటి గురించి మాట్లాడటానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ అన్ని రకాల అంతర్జాతీయ వేదికలను ఉపయోగించుకుంటుందని వెల్లడించారు.
‘హార్ముజ్ జలసంధి మాకు ఎంతో ముఖ్యమైనది. ఈ అంతర్జాతీయ జలమార్గంలో నౌకల ప్రయాణం సురక్షితంగా సాగడమే మా లక్ష్యం. జలసంధిలో పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు నౌకలకు పూర్తిస్థాయి సేవలను అందిస్తాం. దీనికి ఖర్చవుతుంది కాబట్టి తదనుగుణంగా ఫీజులు వసూలు చేస్తాం. ఇరాన్ జాతీయ భద్రతను, ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అంతర్జాతీయ చట్టాల ప్రకారం కొన్ని ప్రత్యేక విధానాలను అమలు చేస్తున్నాం’ అని బఘేయీ తెలిపారు.
