టెహ్రాన్: 48 గంటల్లోగా శాంతి ఒప్పందానికి రాకపోయినా, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవకపోయినా ఇరాన్‌పై తీవ్ర పరిణామాలు ఉంటాయన్న ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ బెదిరింపులను నిస్సహాయమైన, ఆందోళనకరమైనవిగా అభివర్ణించింది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామనడం ట్రంప్ మూర్ఖపు చర్య అని విమర్శించింది. ట్రంప్ ఉడుత ఊపులకు తలొగ్గేదే లేదని మరోసారి తేల్చిచెప్పింది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తలు ఇప్పటికే భీకర స్థాయికి చేరుకున్నాయని.. ఈ దశలో పరిస్థితులను మరింత తీవ్రతరం చేయొద్దని అమెరికాను హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ ఖతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ జనరల్ అలీ అబ్దుల్లాహి అలియాబాది మాట్లాడుతూ.. అమెరికా ఇలాగే దుందుడుకుగా ముందుకు సాగితే నరక ద్వారాలు తెరుచుకుంటాయని మాస్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఒత్తిడికి ఇరాన్ ఎన్నటికీ తలొగ్గదని స్పష్టం చేశారు.
ఇరాన్ మౌలిక సదుపాయాలపై అమెరికా, ఇజ్రాయెల్ చేసే ఏ దాడి అయినా మధ్యప్రాచ్యం అంతటా ఉన్న అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటుందని హెచ్చరించారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి.. అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణకు అదే రీతిలో ప్రతిస్పందించడానికి ఇరాన్ సాయుధ దళాలు ఒక్క క్షణం కూడా వెనుకాడబోవని తమ వైఖరిని స్పష్టం చేశారు.
►ALSO READ | IPL 2026: RCB vs CSK మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే!
48 గంటల్లో ప్రళయమే: ట్రంప్
ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరించాడు. అమెరికాతో ఒప్పందం చేసుకోవడం లేదా హార్మూజ్ జల సంధిని తిరిగి ఓపెన్ చేయడానికి ఇరాన్కు తాను ఇచ్చిన 10 రోజుల గడువు సమీపిస్తోందని గుర్తు చేశాడు. సమయం మించిపోతుందని.. ఇరాన్పై ప్రళయం విరుచుకుపడటానికి కేవలం 48 గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయని వార్నింగ్ ఇచ్చాడు.
ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ట్రూత్ వేదికగా పోస్ట్ పెట్టారు. “ఒప్పందం కుదుర్చుకునేందుకు లేదా హోర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్కు పది రోజుల గడువు ఇచ్చా. సమయం మించిపోతోంది. వారిపై ప్రళయం విరుచుకుపడేందుకు మరో 48 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది" అని హెచ్చరించారు. ట్రంప్ బెదిరింపులను ఇరాన్ ఏ మాత్రం లెక్క చేయలేదు. తమ దేశంలోని మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేస్తే ప్రతీకారం కూడా అదే రేంజ్లో ఉంటుందని హెచ్చరించింది.
