30 రోజుల్లోగా యుద్ధాన్ని ముగించాలి: అమెరికాకు ఇరాన్ తాజా ప్రతిపాదన

30 రోజుల్లోగా యుద్ధాన్ని ముగించాలి: అమెరికాకు ఇరాన్ తాజా ప్రతిపాదన
  • ఆంక్షలు, నేవీ దిగ్బంధం తొలగించాలంటూ ప్రపోజల్ 
  • ప్రతిపాదన పరిశీలిస్తున్నా: ట్రంప్   

టెహ్రాన్/వాషింగ్టన్: కాల్పుల విరమణను పొడిగించడం కంటే 30 రోజుల్లో యుద్ధాన్ని పూర్తిగా ముగించడమే లక్ష్యంగా ఒప్పందం కుదుర్చుకోవాలంటూ అమెరికాకు ఇరాన్ తాజాగా ప్రతిపాదన చేసింది. మొత్తం14 పాయింట్లతో పంపిన తాజా ప్రతిపాదనలో ఆంక్షలు ఎత్తివేయాలని, నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగించాలని, పశ్చిమాసియా నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని ఇరాన్ కోరింది.

 లెబనాన్‌‌లో ఇజ్రాయెల్ దాడులతో సహా అన్ని రకాల శత్రుత్వాలను నిలిపివేయాలని కూడా పాకిస్తాన్ మధ్యవర్తి ద్వారా పంపిన ఈ ప్రతిపాదనలో ఇరాన్ పేర్కొంది. ఇరాన్ పంపిన ఈ కొత్త ప్రతిపాదనను తాను పరిశీలిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే, ఈ ఒప్పందం సఫలమవుతుందా అనే విషయంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. గత 47 ఏళ్లుగా మానవాళికి ఇరాన్ చేసిన దానికి ఆ దేశం ఇంకా తగిన మూల్యం చెల్లించలేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘వారు పద్ధతి మార్చుకోకపోయినా, మిస్ బిహేవ్ చేసినా సైనిక దాడులు మళ్లీ ప్రారంభమవుతాయి’ అని ట్రంప్ హెచ్చరించారు.

హార్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టుదల 

ప్రపంచ చమురు వాణిజ్యంలో కీలకమైన హార్మూజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన పట్టు సడలించడం లేదు. ఈ జలసంధి తమకే చెందుతుందని, యుద్ధానికి ముందున్న పరిస్థితులు ఇక్కడ మళ్లీ వచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ అలీ నిక్జాద్ స్పష్టం చేశారు. అయితే, అమెరికా, ఇజ్రాయెల్‌‌తో సంబంధం లేని నౌకలు టోల్ (రుసుము) చెల్లించి హార్మూజ్ గుండా వెళ్లవచ్చని ఇరాన్ చెబుతుండగా.. ఇరాన్​కు టోల్ చెల్లింపులు చేసే షిప్పింగ్ కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని అమెరికా హెచ్చరించింది. 

కాగా, ప్రస్తుతానికి శాంతి చర్చల్లో హార్మూజ్ జలసంధి, అణు కార్యక్రమం ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి. అణు కార్యక్రమాన్ని పక్కన పెట్టి ముందుగా ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలని ఇరాన్ కోరుతుండగా, అణు నియంత్రణపై హామీ ఉంటేనే ఒప్పందం సాధ్యమని అమెరికా పట్టుబడుతోంది. దీంతో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఇస్లామాబాద్‌‌లో తదుపరి రౌండ్ చర్చలపై సందిగ్ధం నెలకొంది. 

ట్రంప్​కు రెండు ఆప్షన్లే ఉన్నయ్: ఐఆర్జీసీ 

ఇరాన్​తో యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్​కు కేవలం రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని ఐఆర్జీసీ స్పష్టం చేసింది. ఇరాన్​పై ‘అసాధ్యమైన’ సైనిక చర్య చేపట్టాలా? ‘చెడ్డ ఒప్పందం’ కుదుర్చుకోవాలా? అన్న ఆప్షన్లలో ఏదో ఒకదానిని ఆయన ఎంచుకోవాలని తేల్చిచెప్పింది. 

యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ప్రతిపాదించిన ఒప్పందం పట్ల తాను సంతృప్తిగా లేనని ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో, అమెరికా నిర్ణయాలు తీసుకోవడానికి ఉన్న అవకాశం ‘కుంచించుకుపోయిందని’ ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ విభాగం ఆదివారం ‘ఎక్స్’లో పేర్కొంది. 

నౌకాదళ దిగ్బంధనాన్ని ముగించడానికి అమెరికాకు ఇరాన్ ఒక నెల గడువు విధించడం.. అమెరికా పట్ల రష్యా, చైనా, ఐరోపా దేశాల ధోరణి మారడం వంటి దౌత్యపరమైన మార్పుల కారణంగా అమెరికాకు ఆప్షన్లు తగ్గాయని తెలిపింది.