సెయింట్ పీటర్స్‌బర్గ్: భారత్‌ను ఆంక్షలతో బెదిరించాలని ఎవరైనా చూస్తే.. అది వారికే బూమరాంగ్ అవుతుందని(తిప్పికొడుతుందని) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. ‘‘భారత్ ఎల్లప్పుడూ ఒక సార్వభౌమ దేశంగా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉంది. ఆంక్షల పేరుతో బెదిరింపుల ద్వారా భారత్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే అది బెడిసికొడుతుంది” అని అన్నారు. శుక్రవారం సెయింట్ పీటర్స్‌బర్గ్ లో జరిగిన ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో అమెరికాలోకి ప్రవేశించకుండా మోదీపై నిషేధం విధించడాన్ని ఆయన గుర్తు చేశారు. ‘‘ప్రధాని మోదీ దీనిని ఎప్పటికీ మరచిపోరని నాకు తెలుసు. ఇప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నందున ఆ ఆంక్షలన్నీ తొలగిపోయాయి” అని అన్నారు.
సుఖోయ్ 57 యుద్ధ విమానాల తయారీకి భారత్ తమతో కలిసి రావాలని పుతిన్ గురువారం ఆఫర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో భారత్ గనుక రష్యా నుంచి సుఖోయ్ 57 యుద్ధ విమానాలు లేదా ఎస్-500 వైమానిక రక్షణ వ్యవస్థల వంటివి కొనుగోలు చేస్తే అమెరికా ఆంక్షలను ఎదుర్కొనే అవకాశం ఉందా? అని శుక్రవారం విలేకరులు అడిగిన ప్రశ్నకు పుతిన్ ఈ మేరకు స్పందించారు. ‘‘భారత్ ఒక సార్వభౌమ దేశం. తమకు అత్యంత ఆధునికమైనవిగా, అత్యంత అనుకూలమైనవిగా భావించే, సరసమైన ధరలకు లభించే ఉత్పత్తులను ఎంచుకోవడానికి దానికి స్వేచ్ఛ ఉంది.
భారత్ ఎప్పుడూ ఇదే రీతిలో వ్యవహరిస్తూ వస్తోంది’’ అని స్పష్టం చేశారు. భారత్ ఎల్లప్పుడూ తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే నడుచుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాల తరహాలోనే భారత్‌తో రష్యా సహకారం కూడా రాజకీయ వాతావరణానికి లోబడి ఉండదన్నారు. ‘‘మమ్మల్ని ఎవరూ శాసించలేరు. దానికి ఎవరూ ప్రయత్నించరు కూడా. మేం ఎల్లప్పుడూ సరైనదిగా భావించే దాన్నే చేస్తాం. భాగస్వామ్య దేశాలకు, ముఖ్యంగా భారత్ వంటి మిత్ర దేశాలకు ఇచ్చిన మాటకు మేం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం” అని పుతిన్ తేల్చిచెప్పారు.
మధ్య శ్రేణి క్షిపణి బ్రహ్మోస్ రూపకల్పనపై ఇరుదేశాల నిపుణులు కలిసి పని చేస్తున్నారని గుర్తు చేశారు. ‘‘సుఖోయ్ 57 విమానం ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనది. దీనిని కలిసి చేద్దామని భారత్ ను కోరాం. అది కుదరలేదు. కానీ మేం స్వంతంగా దీనిని తయారు చేశాం. ఇప్పుడు సుఖోయ్57 విమానాన్ని విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాం” అని చెప్పారు.
