- లేకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిక
టెహ్రాన్: అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ‘చైల్డ్కిల్లర్’ అంటూ ఇరాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమెరికా సైనిక దాడిలో ఇరాన్‌లోని మినాబ్ ప్రాంతంలో ఒక పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో 165 మంది బాలికలు మృతి చెందిన ఘటనను ప్రస్తావిస్తూ ట్రంప్‌ను చైల్డ్ కిల్లర్ గా అభివర్ణించింది. “చైల్డ్ కిల్లర్ ట్రంప్ నుంచి దూరంగా ఉండండి.. లేదంటే తీవ్ర ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి వస్తుంది” అంటూ ఇరాన్ ఉన్నతాధికారులు అమెరికా బలగాలను హెచ్చరించాయి.
ఇరాన్ అధ్యక్ష కార్యాలయంలో కమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన ఉన్నతాధికారి సెయ్యద్ మెహ్దీ తబతబాయీ మాట్లాడుతూ.. అమెరికా అధికారులు ట్రంప్ తవ్వుకున్న గోతి నుంచి బయటకు రావాలని అన్నారు. స్కూల్‌పై దాడిని ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ.. ఈ చర్యలకు అమెరికా పరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేసింది. అలాగే, అమెరికా బలగాలు తమ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లాలని కూడా సూచించింది. “మాది శాంతి కోరుకునే దేశమే. కానీ, బలప్రయోగంతో మాట్లాడితే కఠినమైన ఎదురుదెబ్బ తప్పదు” అని తబతబాయీ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి.
మొజ్తబా క్షేమం.. శత్రువులవి తప్పుడు ప్రచారాలే..
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై గత కొద్ది కాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ ఇరాన్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత రెండు నెలలుగా మొజ్తబా ఖమేనీ చనిపోయారని, తీవ్రంగా గాయపడ్డారని జరుగుతున్న ప్రచారాన్ని ఖమేనీ కార్యాలయం కొట్టిపారేసింది.
ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని.. దేశ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేసింది. ‘శత్రు శక్తులు వదంతులు వ్యాపింపజేసి, మా నుంచి ప్రతిచర్యలను రెచ్చగొట్టి, తద్వారా తమ కుట్రలను ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాయి’ అని ఖమేనీ కార్యాలయ అంతర్జాతీయ వ్యవహారాల డిప్యూటీ హెడ్ పేర్కొన్నారు. ఒక రోజు ముందు ఖమేనీ.. ట్రంప్ డిమాండ్లను ధిక్కరిస్తూ, ఇరాన్ తన అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ సంపదగా కాపాడుకుంటుందని చెబుతూ కొత్త లిఖితపూర్వక ప్రకటనను జారీ చేశారు.
అమెరికాతో చర్చలకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు
అమెరికాతో చర్చలు జరిపేందుకు ఇరాన్ ఒక కొత్త ప్రతిపాదనల ముసాయిదాను సిద్ధం చేసింది. మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్ ద్వారా ఈ ప్రతిపాదనలను గురువారం సాయంత్రం అమెరికాకు పంపినట్టు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది.
లెబనాన్ లో ఐడీఎఫ్ దాడులు.. 30 మంది మృతి
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఒకే రోజు 30 మందికి పైగా మరణించారు. ఇది అమెరికా మద్దతుతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని బలహీనపరిచింది. అమెరికా సైనిక ఉన్నతాధికారులు (అడ్మిరల్ బ్రాడ్ కూపర్, జనరల్ డాన్ కెయిన్) గురువారం రాత్రి అధ్యక్షుడు ట్రంప్‌ను కలిసి 45 నిమిషాల పాటు చర్చించారు. ఇరాన్‌పై భవిష్యత్తులో చేపట్టబోయే సైనిక చర్యల ప్రణాళికలను వారు ట్రంప్‌కు వివరించినట్లు తెలుస్తోంది.
ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు?
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చిని పదవి నుంచి తొలగించాలని అధ్యక్షుడు పెజెష్కియాన్ భావిస్తున్నట్టు సమాచారం. అరాగ్చి.. అధ్యక్షుడిని కాదని నేరుగా రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్ జీసీ) ఆదేశాలను పాటిస్తున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. కాగా, ఇరాన్ ఓడరేవులను అమెరికా ముట్టడించడాన్ని పెజెష్కియాన్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలను ఇరాన్ సహించదని హెచ్చరించారు.
అమెరికా తన యుద్ధ ఖర్చుల గురించి అబద్ధాలు చెబుతోందని అరాగ్చి ఆరోపించారు. పెంటగాన్ చెబుతున్న దానికంటే నాలుగు రెట్లు ఎక్కువగా, దాదాపు 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేసిందని, దీనివల్ల ప్రతి అమెరికా కుటుంబంపై నెలకు 500 డాలర్ల భారం పడుతోందన్నారు.
