‘కరువు’ చూపించిన కోట

‘కరువు’ చూపించిన కోట

ఇది 3400 ఏళ్ల నాటి పురాతన కోట. ఇరాక్​లోని కుర్దిస్థాన్​ రీజియన్​లో ఉంది. అయితే, ఏంటట.. అందులో ఏముందట.. ఎన్ని కోటల్లేవ్​ అట్లాంటివి? అంటారా! ఉన్నాయి.. కానీ, ఈ కోట చాలా స్పెషల్​. ఎందుకంటే, నదిలో మునిగిపోయిన కోట అది. ఇప్పుడు ఇరాక్​లో కరువు కోరలు చాచడంతో అక్కడి నదులు, రిజర్వాయర్లు ఎండిపోయాయి. దీంతో ఇప్పుడు ఈ కోట ఇలా బయటపడింది. ఆర్కియాలజిస్టులకు పనిపెట్టింది. మిట్టనీ ఎంపైర్​కు చెందిన రాజుల కోట అని పురాతత్వ నిపుణులు చెబుతున్నారు.

ఏన్షియంట్​ నియర్​ ఈస్ట్​ ఎంపైర్స్​లో అతి తక్కువ పరిశోధనలు జరిగింది ఈ మిట్టనీ ఎంపైర్​పైనేనని కుర్దిష్​– జర్మనీ ఆర్కియాలజిస్టులు బృందం ప్రెస్​ రిలీజ్​లో చెప్పింది. ఇటీవలి కాలంలో ఇక్కడ దొరికిన ఆర్కియాలాజికల్​ ఆనవాళ్లు చాలా ముఖ్యమైనవని కుర్దిష్​ ఆర్కియాలజిస్ట్​ హసన్​ అహ్మద్​ ఖాసిం చెప్పారు. నదిలోపల ఉన్న ఈ కోట ఎత్తు 65 అడుగులు అని ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. పూర్తిగా మట్టితో తయారు చేసిన ఇటుకలతోనే కోటను కట్టారని, ఒక్కొక్క గోడ మందం 6.6 అడుగులుందని యూనివర్సిటీ ఆఫ్​ బుబింజెన్​లోని ఇనిస్టిట్యూట్​ ఫర్​ ఏన్షియంట్​ నియర్​ ఈస్టర్న్​ స్టడీస్​ ఆర్కియాలజిస్ట్​ ఇవానా పుల్జిజ్​ చెప్పారు. ఈ ప్రాంతంలో మిట్టనీ కాలానికి చెందిన వాల్​ పెయింటింగ్స్​ బయటపడిన రెండో చారిత్రక ప్రదేశం ఇది మాత్రమేనని అన్నారు. అంతేగాకుండా అక్కడి లిపిని కూడా సైంటిస్టులు గుర్తించారు. దాని వల్ల మిట్టనీ ఎంపైర్​ చరిత్ర తెలుసుకునే అవకాశం దొరుకుతుందన్నారు. అన్నట్టు, ఆ కోట పేరు.. అది బయటపడిన నది పేరు చెప్పలేదు కదూ! ఆ కోట పేరు ‘కెమునే’. టైగ్రిస్​ నదిపై కట్టిన మోసూల్​ డ్యాంలో కరువుతో ఇలా తేలి బయటపడింది.