- చక్రం తిప్పుతున్న కొందరు అధికారులు
- 108 దరఖాస్తుల్లో కేవలం 25 అప్లికేషన్లకే గ్రీన్ సిగ్నల్ ?
- ఆబ్కారీశాఖ తీరుతో సర్కారు ఆదాయానికి గండి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరిన్ని మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుకు ఆబ్కారీ శాఖ చేపట్టిన దరఖాస్తుల ప్రక్రియలో పారదర్శకత లోపించిందనే ఆరోపణలు వస్తున్నాయి. పరిమిత స్థాయిలో బీరు, బ్రీజర్ ఉత్పత్తి కోసం ఉద్దేశించిన ఈ మైక్రో బ్రూవరీలు ఇన్నాళ్లూ హైదరాబాద్‌కే పరిమితం కాగా.. ఇప్పుడు జిల్లాల్లోనూ అవకాశమిచ్చారు. గతేడాది సెప్టెంబరులో నోటిఫికేషన్ ఇవ్వగా.. రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారుల నుంచి 108 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష చొప్పున ఫీజు కట్టినప్పటికీ నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి కేవలం 25 మందికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇటీవల వైన్స్ టెండర్ల ద్వారా సర్కారుకు ఏకంగా రూ.2,639 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. లక్కీ డ్రా ఉండడం వల్లే ఈ స్థాయిలో అప్లికేషన్లు వచ్చాయి. కానీ, మైక్రో బ్రూవరీల విషయంలో మాత్రం లక్కీ డ్రా లేకుండా గుట్టుగా కేటాయించాలనే కొందరు అధికారుల నిర్ణయం వల్ల రాష్ట్ర సర్కారుకు భారీ నష్టం వాటిల్లుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం 18.. ఇప్పుడు మరిన్ని..
వాస్తవానికి హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో మాత్రమే గతంలో 18 మైక్రో బ్రూవరీలు ఉండేవి. నూతన విధానంలో మిగిలిన కార్పొరేషన్లలోనూ వీటి ఏర్పాటుకు అవకాశం కల్పించారు. హోటల్ లేదా రెస్టారెంట్ ఉన్నవారు అక్కడే బీర్లు తయారుచేసి విక్రయించుకునే వెసులుబాటు కల్పించారు. టీసీయూఆర్ పరిధిలోని బోడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, నిజాంపేట, బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్ వంటి ప్రాంతాల్లోనూ బ్రూవరీలకు రెడ్ కార్పెట్ పరిచారు. డిమాండ్ ఉన్నప్పుడు లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా కేటాయించాల్సి ఉన్నా, ఆ ఊసే ఎత్తడం లేదు.
మైక్రో బ్రూవరీలు అంటే..
మైక్రోబ్రూవరీల్లో చిన్న స్థాయిలో బీరు ఉత్పత్తి చేస్తారు. ఇవి భారీ వాణిజ్య బ్రూవరీల్లా కాకుండా పరిమిత పరిమాణంలో ప్రత్యేక రుచులతో బీర్లను తయారు చేస్తాయి. పండుగలు, ప్రత్యేక సీజన్లను బట్టి సీజనల్ బ్రూస్ తయారు చేయడం వీటి ప్రత్యేకత. బ్రూవరీస్లో బీర్ తయారీ ప్రక్రియను దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. ఇది కస్టమర్లకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.
ఏపీ, కర్నాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రతో పోలిస్తే.. రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. బీరు వినియోగం పెరుగుతున్నందున బ్రూవరీల విస్తరణ ద్వారా ఆదాయం లభిస్తుందని ఎక్సైజ్‌శాఖ అంచనా వేస్తోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరులో పెద్ద సంఖ్యలో మైక్రో బ్రూవరీలున్నాయి.
