తెలంగాణ నిర్మిస్తున్నప్రాజెక్టులు కొత్తవి కావు

తెలంగాణ నిర్మిస్తున్నప్రాజెక్టులు కొత్తవి కావు

హైదరాబాద్‌‌, వెలుగు: గోదావరి, కృష్ణా నదులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమం కాదని ఇరిగేషన్‌‌ ఇంజనీర్లు చెప్తున్నారు. ఏపీ తలపెట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్‌‌ స్కీం, పట్టిసీమ, పురుషోత్తమపట్నం, నాగల్‌‌దిన్నె ప్రాజెక్టులు పూర్తిగా కొత్తవని, వాటిని కట్టడి చేయాల్సిన బాధ్యత కేఆర్‌‌ఎంబీ, జీఆర్‌‌ఎంబీకి ఉందని అంటున్నారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ స్కీములకు అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ ఆమోదం పొందిన తర్వాత మళ్లీ వాటి డీపీఆర్‌‌లు ఇవ్వాలని కోరడంలో అర్థం లేదని చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో ఆమోదం పొందిన ప్రాజెక్టులనే రాష్ట్రంలో నిర్మిస్తున్నాం తప్ప.. కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టలేదని అంటున్నారు. సాగర్‌‌ ఎడమ కాలువ ఆయకట్టును స్థిరీకరించడానికి భక్తరామదాసు ఎత్తిపోతల పథకం చేపట్టామని, రాష్ట్రానికి కేటాయించిన నీటిని మాత్రమే దాని ద్వారా ఉపయోగించుకుంటున్నామని వివరించారు. ఏపీ కంప్లైంట్‌‌ చేసిందని కేఆర్‌‌ఎంబీ రాష్ట్రానికి లేఖ రాయడం కంటే అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ నిర్ణయాలను ఒకసారి పరిశీలిస్తే బాగుండేదని అంటున్నారు.

కొత్త ప్రాజెక్టులు కాదు

కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం కూడా కొత్త ప్రాజెక్టులు కావని ఇంజనీర్లు చెప్తున్నారు. ప్రాణహిత–చేవెళ్లను రీడిజైన్‌‌ చేసి కాళేశ్వరం నిర్మిస్తున్నామని, రాజీవ్‌‌సాగర్‌‌, ఇందిరాసాగర్‌‌ ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్‌‌ చేసి సీతారామగా మార్చామని అంటున్నారు. దేవాదుల బ్యారేజీతో ఎగ్జిస్టింగ్‌‌ పంపుహౌస్‌‌కు నీళ్లే అందవని, ఉమ్మడి ఏపీలో చేసిన డిజైన్‌‌ లోపంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని, ఆ ప్రాజెక్టు పూర్తి ఆయకట్టుకు నీళ్లు అందించేందుకే తుపాలకుగూడెం బ్యారేజీ నిర్మిస్తున్నామని ఇవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో చేపట్టినవేనని గుర్తు చేస్తున్నారు. కేఆర్‌‌ఎంబీ, జీఆర్‌‌ఎంబీ ఏర్పడక ముందే రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు. కొన్నింటి పేర్లు మార్చామని.. మరికొన్ని ప్రాజెక్టులు నీళ్లు తీసుకునే సోర్స్‌‌ మార్చామని.. ఈ మార్పు తప్ప అవి కొత్త ప్రాజెక్టులనడం సరికాదని, ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు ఇవ్వాలని కేఆర్‌‌ఎంబీ, జీఆర్‌‌ఎంబీ కోరడంలో అర్థం లేదని చెప్పారు.

లెటర్లు రాయడం కొత్త కాదు

ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు ఇవ్వాలంటూ బోర్డులు లేఖ రాయడం కొత్తకాదని ఇప్పటికే చాలాసార్లు రాశాయని ఇంజనీర్లు అంటున్నారు. ఆయా ప్రాజెక్టులకు అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ అనుమతి ఇచ్చే వరకు నిర్మాణాలు కొనసాగించవద్దని చెప్పడంపై ఇంజనీర్లు స్పందించడానికి నిరాకరించారు. వాటిపై ప్రభుత్వమే అపెక్స్‌‌ కౌన్సిల్‌‌లో తేల్చుకుంటుందని, అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ నిర్వహిస్తే వాటికి ఆమోదం లభించడం పెద్ద విషయమేమి కాదని చెబుతున్నారు.

డీపీఆర్​లు ఇవ్వాలని ఏమీ లేదు

కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ, ఫారెస్ట్‌‌ క్లియరెన్స్‌‌లతో పాటు పది రకాల పర్మిషన్లు వచ్చాయని, పాలమూరు–రంగారెడ్డి, డిండి, సీతారామ, తుపాకులగూడెం, చిన్న కాళేశ్వ రం తదితర ప్రాజెక్టులకు ఫారెస్ట్‌‌ క్లియరెన్స్‌‌ వచ్చిందని, మిగతా అనుమతులు వివిధ దశల్లో ఉన్నాయని చెప్తున్నారు. ఒక ప్రాజెక్టు ఫైనల్‌‌ డీపీఆర్‌‌ అప్రూవల్‌‌ అయ్యేందుకు సీడబ్ల్యూసీకి చాలాసార్లు కమ్యూనికేట్‌‌ చేయాల్సి ఉంటుందని, చిన్నచిన్న లోపాలు ఉన్నా రాష్ట్రాలకు తిరిగి పంపుతుందని అంటున్నారు.

వెహికల్స్ బాగా కొంటున్నారు