
హైదరాబాద్, వెలుగు: బడ్జెట్ కేటాయింపులెలా ఉన్నా.. వచ్చే ఏడాది రూ.36 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచేందుకు ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ రెడీ అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ, దుమ్ముగూడెం, చెక్ డ్యాంలు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్, సీతారామ లిఫ్ట్ స్కీంతో సాగర్ లెఫ్ట్ కెనాల్ ఆయకట్టు లింక్ ప్రాజెక్టు పనులను ఈ ఏడాది చేపట్టాలని సీఎం కేసీఆర్ఇప్పటికే ఆదేశించారు. దీంతో ఈ ప్రాజెక్టులను చేపట్టేందుకు అవసరమైన అంచనా వ్యయంతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
మూడు టీఎంసీలు ఒకేసారి ప్రవహించేలా..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోసే పనులు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు మూడో టీఎంసీ నీటిని తరలించే పనులను కొత్తగా ప్రారంభించనున్నారు. మిడ్‌మానేరు నుంచి అనంతగిరికి, అక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు రెండో టీఎంసీ నీటిని ఎత్తిపోసే పనులకు ఇప్పటికే ప్రపోజల్స్ రెడీ అయ్యాయి. వీటికి సీఎం కేసీఆర్ ఓకే చెప్పారు. ఫైనాన్షియల్ అప్రూవల్‌కు సంబంధించిన ప్రాసెస్ పూర్తికావొచ్చింది. ఎల్లంపల్లి నుంచి వరద కాలువ వరకు రెండు దశల్లో నీటిని లిఫ్ట్ చేయనున్నారు. మధ్యలో దేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. పైపులైన్, గ్రావిటీ కాలువ ద్వారా నీటిని తరలించేలా ప్రపోజల్ సిద్ధం చేశారు. మూడు టీఎంసీల నీళ్లు ఒకేసారి ప్రవహించేలా వరద కాలువను వెడల్పు చేయనున్నారు. ఈ పనులన్నింటికీ రూ.11,800 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్‌కు మూడు దశల్లో నీటిని లిఫ్ట్ చేసేలా పంపుహౌస్‌ల నిర్మాణానికి అధికారులు ప్రతిపాదించారు. పైప్ లైన్, గ్రావిటీ కాలువ ద్వారా నీటిని అనంతగిరికి, అక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు తరలిస్తారు. మిడ్‌మానేరు నుంచి అనంతగిరి వరకు రూ.4,142 కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్ వరకు రూ.10,260 కోట్లతో పనులు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఎస్టిమేట్లు రెడీ చేశారు. త్వరలోనే టెండర్లు పిలిచేందుకు కావాల్సిన ప్రాసెస్ పూర్తి చేస్తున్నారు. మొత్తంగా కాళేశ్వరం అదనపు టీఎంసీ పనులను రూ.26,202 కోట్లతో చేపట్టనున్నారు.
దుమ్ముగూడెం బ్యారేజీకి త్వరలో టెండర్లు
దుమ్ముగూడెం బ్యారేజీ నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచేందుకు ఇరిగేషన్ ఇంజనీర్లు ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారు. 37 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీతో బ్యారేజీ నిర్మించనున్నారు. పవర్ స్టేషన్, ఇతర పనులకు రూ.3,482 కోట్లు అవసరమని అంచనా వేశారు. మైనర్ ఇరిగేషన్‌లో భాగంగా 610 చెక్‌డ్యాంలకు టెండర్లు పిలిచేందుకు అన్నీ ప్రిపేర్ చేశారు. వీటికి రూ.2,500 కోట్ల వరకు అవసరమని లెక్కగట్టారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌తో పాటు ఇతర పనులను రూ.2 వేల కోట్లతో, సీతారామ ప్రాజెక్టు నీళ్లతో సాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీళ్లిచ్చే స్కీంకు మరో రూ.2 వేల కోట్లకు పైగా నిధులతో ప్రపోజల్స్ రెడీ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు అవసరమైన నిధులు బడ్జెట్‌లోనే కేటాయిస్తామని సీఎం చెప్పినా, కొత్త పనులకు అవసరమైన నిధులను లోన్ల నుంచే సమకూర్చే అవకాశముందని ఇంజనీర్లు చెప్తున్నారు. ఈ పనులకు కావాల్సిన టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వంటి అంశాలు ఫైనల్ స్టేజీలో ఉన్నాయని, అవి పూర్తికాగానే టెండర్లు పిలుస్తామని అంటున్నారు. ఫైనాన్షియల్ ఇయర్‌కు ముందే కొన్ని టెండర్లు పిలిచినా.. పనులు చేపట్టేది మాత్రం 2020–21 మొదలయ్యాకేనని స్పష్టం చేస్తున్నారు.