పద్మారావునగర్, వెలుగు: అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఈ నెల 18 నుంచి మెడికల్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో యాత్రికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ వాణి తెలిపారు.
యాత్రికులు ఆన్లైన్ నుంచి దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకుని, అవసరమైన రిపోర్టులతో హాజరవ్వాలని సూచించారు. తొలి విడత శనివారం, ఆ తర్వాత ప్రతి శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, కార్డియాలజీ వంటి వివిధ విభాగాల నిపుణులతో కూడిన బోర్డు యాత్రికుల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించి, ఫిట్నెస్ఉన్న వారికి తక్షణమే ధ్రువీకరణ పత్రాలు అందజేస్తుందన్నారు.

