- బడా బాబులకు ఐటీ గుబులు!
- బ్లాక్‌మనీ టార్గెట్‌గా హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఆపరేషన్
- అనుమానం వస్తే చాలు.. 131(1ఏ) కింద నోటీసులు
- వేలాది ప్రీ-సెర్చ్ నోటీసులతో దేశంలోనే టాప్
- చర్చనీయాంశంగా మారిన హైదరాబాద్ ఐటీ వింగ్
హైదరాబాద్, వెలుగు: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్థిక, రాజకీయ, రియల్ ఎస్టేట్ రంగాల దిగ్గజాలకు ఆదాయపు పన్ను శాఖ గుబులు మొదలైంది. ఇన్కం టాక్స్‌లో అత్యంత శక్తిమంతమైన రూల్‌గా భావించే సెక్షన్ 131(1ఏ) ఇప్పుడు రాష్ట్రంలోని బడా బాబులపై ప్రయోగిస్తున్నారు. సాధారణంగా ఐటీ శాఖ నుంచి వచ్చే నోటీసులు అంటే వివరణలు అడగడం లేదా పన్ను బకాయిల గురించి హెచ్చరించడం జరుగుతుంది. కానీ, ఈ సెక్షన్ కింద జారీ అయ్యే నోటీసులు మాత్రం ఇందుకు భిన్నంగా, ఒక రకమైన ‘అప్రకటిత సోదా’లా మారుతుండడంతో వ్యాపార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. దేశంలోని మరే ఇతర మెట్రో నగరంలో లేని విధంగా, హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ నుంచే రికార్డు స్థాయిలో ఈ నోటీసులు జారీ కావడం గమనార్హం. రెండేళ్లుగా ఆదాయపు పన్ను శాఖాధికారులు గుట్టుచప్పుడు కాకుండా సేకరించిన సమాచారం ఆధారంగా, భారీ నగదు లావాదేవీలు నిర్వహించే రియల్ ఎస్టేట్ కంపెనీలు, మౌలిక సదుపాయాల సంస్థలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగుతున్నట్లు స్పష్టమవుతున్నది.
ఇప్పటికే వేలల్లో నోటీసులు అందినట్లు తెలుస్తున్నది.సివిల్ కోర్టు అధికారాలతో వ్యాపార రహస్యాల గుట్టురట్టు సెక్షన్ 131(1ఏ) పవర్‌ఫుల్‌గా చెబుతున్నారు. అధికారులకు ఇది విస్తృత విచారణాధికారలు కల్పిస్తున్నది. సాధారణంగా ఐటీ యాక్ట్ ప్రకారం ఏవైనా నోటీసులు ఇవ్వాలంటే సంబంధిత వ్యక్తిపై పక్కా ఆధారాలు లేదా గతంలో పెండింగ్‌లో ఉన్న కేసులు ఉండాలి. కానీ ఈ సెక్షన్ కింద, ఒక వ్యక్తి తన ఆదాయాన్ని దాచిపెడుతున్నాడని లేదా లెక్కల్లో చూపని నగదును కలిగి ఉన్నాడని అధికారులకు అనుమానం వస్తే చాలు, ముందస్తు హెచ్చరికలు లేకుండా నోటీసులు జారీ చేయవచ్చు. ఈ నోటీసు అందిన వెంటనే సంబంధిత వ్యక్తులు వ్యక్తిగతంగా ఐటీ అధికారుల ముందు హాజరుకావాల్సి ఉంటుంది. కేవలం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవే కాకుండా, ఏళ్ల నాటి పాత రికార్డులను, డైరీలను, బ్యాంకు స్టేట్‌మెంట్లను ఇతరత్రా డిజిటల్ ఆధారాలను సమర్పించాలని అధికారులు ఆదేశించే అధికారం కలిగి ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే, ఒక వ్యక్తికి సంబంధించిన పూర్తి ఆర్థిక గుట్టును బయటకు తీయడానికి ఈ సెక్షన్ అధికారులకు అస్ర్తంలా ఉపయోగపడుతుంది.
నిఘా నీడలో బడా వ్యాపారుల బినామీలు
హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఈ పరిణామాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. దేశవ్యాప్తంగా ఐటీ ఇన్వెస్టిగేషన్ విభాగాలు ఉన్నప్పటికీ, హైదరాబాద్ యూనిట్ ఈ విషయంలో అత్యంత క్రియాశీలంగా వ్యవహరిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం విశేషం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో జరుగుతున్న భారీ ఇన్వెంటరీ లావాదేవీలు, వెంచర్లలో చేతులు మారుతున్న ‘బ్లాక్ మనీ’పై అధికారులు డేగ కన్ను వేశారు. గాలిలో దీపం పెట్టినట్లుగా కాకుండా, పక్కా సమాచారంతో బడా వ్యాపారవేత్తల ఇల్లు, కార్యాలయాలతో పాటు వారి బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తుల నివాసాల పైనా ఈ సెక్షన్ కింద నిఘా పెట్టారు. నోటీసులు అందిన వారు తమ వద్ద ఉన్న లెక్కలు చూపని ఆస్తులను, ఆదాయాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. చట్టం ప్రకారం అధికారులు అడిగిన అన్ని రికార్డులను నిర్ణీత గడువులోగా సమర్పించలేకపోతే, అది నేరుగా పూర్తిస్థాయి ఐటీ సోదాలకు దారితీస్తుందనే భయం ఇప్పుడు బడా వ్యాపారులను వెంటాడుతోంది.
లొంగిపోయి పన్ను కట్టేలా ‘వాలంటరీ’ ఒత్తిడికి వ్యూహం
ఈ మొత్తం వ్యవహారంలో ఐటీ ఇన్వెస్టిగేషన్ విభాగానికి చెందిన డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. పన్ను నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఆదాయాన్ని దాచేసే వారిపై ప్రయోగించే ఈ సెక్షన్‌ను అధికారులు ఒక తిరుగులేని అస్త్రంలా ఉపయోగిస్తున్నారు. కేవలం ఆదాయపు పన్ను ఎగవేతను కనిపెట్టడమే కాకుండా, పన్ను ఎగవేతదారుల్లో భయాన్ని కలిగించి వారు స్వచ్ఛందంగా ఆదాయాన్ని వెల్లడించేలా చేయడం కూడా ఐటీ శాఖ వ్యూహంగా కనిపిస్తోంది. గడిచిన కొద్ది కాలంలో జారీ చేసిన నోటీసుల ద్వారా వేల కోట్ల రూపాయల మేర లెక్కల్లో చూపని ఆదాయం బయటపడే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం నోటీసులు అందిన బడా బాబులు వారి ఆడిటర్లు, న్యాయ నిపుణుల చుట్టూ తిరుగుతూ తదుపరి పరిణామాల నుంచి ఎలా బయటపడాలో అన్వేషిస్తున్నారు. మొత్తం మీద, హైదరాబాద్ ఐటీ యూనిట్ చేపట్టిన ఈ ఆపరేషన్ 131(1ఏ) తెలుగు రాష్ట్రాల వ్యాపార వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నది.
డేటా అనలిటిక్స్ టెక్నాలజీతో నిఘా
ఐటీ శాఖ ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ ఆధారిత నిఘాను విస్తృతం చేసినట్లు స్పష్టమవుతోంది. గతంలో లాగా క్షేత్రస్థాయి సమాచారం కోసమే కాకుండా, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు, బ్యాంకింగ్ లావాదేవీలు లగ్జరీ వస్తువుల కొనుగోళ్లకు సంబంధించిన డేటాను విశ్లేషించే ఏఐ సాఫ్ట్‌వేర్ల ద్వారా ఐటీ వింగ్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సాగుతున్న ‘ప్రీ-లాంచ్’ ఆఫర్లు, యూడీఎస్ విక్రయాల్లో పెద్ద ఎత్తున నగదు రూపంలో చేతులు మారిన నల్లధనాన్ని వెలికితీయడమే లక్ష్యంగా అధికారులు అడుగులు వేస్తున్నారు. ఒక వైపు వందలాది మంది సిబ్బందితో ప్రత్యక్షంగా దాడులు (రైడ్స్) నిర్వహించే భారం, సమయం లేకుండానే... కేవలం ఈ నోటీసుల ద్వారా నిందితులను నేరుగా తమ కార్యాలయాలకే రప్పించి, వారి చేతే నిజాలు ఒప్పించే వ్యూహం ఇందులో కనిపిస్తోంది. ఈ సెక్షన్ కింద ఇచ్చే నోటీసులకు తప్పుడు సమాధానాలు ఇస్తే అది క్రిమినల్ చర్యలకు దారితీసే ప్రమాదం ఉండటంతో, వ్యాపారవేత్తలు తమ అప్రకటిత ఆదాయంపై ఆందోళన చెందుతున్నారు.
