కేసీఆర్ మాటమీద నిలబడడని మరోసారి రుజువైంది

కేసీఆర్ మాటమీద నిలబడడని మరోసారి రుజువైంది

కేసీఆర్ మాటలు చాలా తియ్యగా ఉంటాయని... చేతలు మాత్రం కఠిక చేదుగా ఉంటాయని పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి అన్నారు. వీఆర్ఏల జీతాలు, జీవితాలు ఉద్ధరిస్తానని 2020 సెప్టెంబర్ 9న అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారన్న రేవంత్ రెడ్డి... చచ్చినా’ కేసీఆర్ మాటమీద నిలబడడని మరోసారి రుజువైందని ఆరోపించారు. ఇటీవల వీఆర్ఏలు చేపట్టిన ఆందోళన 48 రోజులకు చేరుకుంది. ఈ నిరసనలో భాగంగా 28మంది గ్రామ సహాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు ఉరి వేసుకొని బలవన్మరణం చెందారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న కారణంలో ఆందోళనతో నిరసన చేపట్టిన వీఆర్ఏలకు.. గౌరవ వేతనం నిలిపివేయడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా.. అడుగు ముందుకు పడడం లేదని వీఆర్ఏలు ఆవేదనం వ్యక్తం చేస్తున్నారు. వీఆర్ఏ వ్యవస్థ రద్దుతో తమ ఉద్యోగ భద్రతపైనా వారికి ఆందోళన నెలకొంది. ఇతర శాఖల్లోకి మారుస్తామని, సర్దుబాటు చేస్తామని చెప్తున్నా అది కార్యరూపం దాల్చకపోవడంతో వీఆర్ఏల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎలాగైనా ఉద్యోగాన్ని కాపాడుకోవాలన్న ఆవేదనతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23వేల మంది వీఆర్ఏలు ఆందోళన చేపట్టారు.  సమ్మె మొదలు పెట్టిన దగ్గర్నుంచి వారికి ప్రభుత్వం గౌరవ వేతనం కూడా నిలిపివేయడంతో వారు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.