బోట్ ఇండియన్​ సౌండ్​.. నాలుగేండ్లలో వరల్డ్​ టాప్​ వేరబుల్​ బ్రాండ్

బోట్ ఇండియన్​ సౌండ్​.. నాలుగేండ్లలో వరల్డ్​ టాప్​ వేరబుల్​ బ్రాండ్

చిన్న పెట్టుబడితో మొదలైన ఒక ఇండియన్​ స్టార్టప్​ కంపెనీ.. కట్​ చేస్తే నాలుగేండ్లలో వరల్డ్​ టాప్​ వేరబుల్​ బ్రాండ్​ హోదా దక్కించుకుంది. కొత్త కొత్త వ్యూహాలతో ఇండియన్​ మార్కెట్​లో తనదైన ముద్ర వేసింది. యూత్​కి నచ్చిన బ్రాండ్​గా పేరు తెచ్చుకుంది. అంతెందుకు ఇప్పుడు యూత్​లో ఆ బ్రాండ్​ గురించి తెలియనివాళ్లు చాలా అరుదు. అదే బోట్​ లైఫ్​స్టైల్​.

టాప్ గ్లోబల్ వేరబుల్​ బ్రాండ్‌‌ల లిస్ట్​లో ఇండియన్​ కంపెనీలు చోటు దక్కించుకోవడం చాలా అరుదు. అందులోనూ కంపెనీ పెట్టిన తక్కువ టైంలోనే ఆ ఘనత సాధించడం అసాధ్యమనే చెప్పాలి. కానీ.. బోట్​ కంపెనీ సుసాధ్యం చేసింది. 2020 సెప్టెంబర్​ క్వార్టర్​లో టాప్​ గ్లోబల్​ వేరబుల్ బ్రాండ్స్​ లిస్ట్​లో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. 

2016కి ముందు ఇండియాలో చైనీస్​ ఇయర్ ​ఫోన్లు చాలా చవకగా దొరికేవి. కానీ.. వాడడం మొదలుపెట్టిన కొన్నాళ్లకే పాడయ్యేవి. ఒకవైపు స్పీకర్​​ లేదంటే మైక్​ పనిచేసేవి కాదు. అలాంటి సమస్యలకు చెక్​ పెడుతూ ఇండియన్​ బ్రాండెడ్​ ఇయర్​ఫోన్లను తీసుకొచ్చింది బోట్​. తక్కువ ధరకు క్వాలిటీ ఇయర్​ఫోన్స్​ని అమ్మింది. దాంతో ఒక్కసారిగా ఇండియన్​ ఆడియో ఇండస్ట్రీలో కంపెనీకి హైప్​ క్రియేట్​ అయ్యింది. ముఖ్యంగా మిలీనియల్స్​కి బోట్​ బాగా నచ్చింది. 

బోట్​ ఎలా వచ్చింది? 

ఈ కంపెనీని సమీర్ మెహతా, అమన్ గుప్తా కలిసి ఢిల్లీలో 2016లో స్థాపించారు. దీన్ని మొదలుపెట్టేందుకు వాళ్లు 30 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. ముందు ఈ కంపెనీ ఛార్జింగ్​ కేబుల్స్​ని మాత్రమే ఉత్పత్తి చేసేది. తర్వాత ఇయర్​ఫోన్స్​, వైర్‌‌లెస్ స్పీకర్లు, ఇయర్‌‌బడ్స్ (ఎయిర్‌‌డోప్స్),  వైర్‌‌లెస్ హెడ్‌‌ఫోన్లు, హోమ్ ఆడియో అప్లియెన్సెస్​, అడాప్టర్లు.. లాంటివి తీసుకొచ్చింది. అయితే.. బోట్ మార్కెట్‌‌లోకి వచ్చేటప్పటికే మార్కెట్‌‌లో దాదాపు 200కి పైగా హియరబుల్స్ బ్రాండ్స్​ అందుబాటులో ఉన్నాయి. వాటిలో బోస్, యాపిల్ ఇయిర్‌‌పాడ్స్, జెబిఎల్, సెన్‌‌హైజర్ లాంటి బాగా తెలిసినవి కూడా ఉన్నాయి. కానీ.. అవి అల్ట్రా -ప్రీమియం, ప్రీమియం కేటగిరీల్లో ఉన్నాయి. అందుకే బోట్ మిడ్ రేంజ్​ సెగ్మెంట్​లో తీసుకొచ్చింది.  

అమన్​కి బోట్ మొదటి ప్రాజెక్ట్​ కాదు. అమన్ ఫ్యామిలీ అప్పటికే ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో ఉంది. చదువు పూర్తయ్యాక అమన్​ కూడా ఆ వ్యాపారం చేశాడు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కామర్స్‌‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశాడు. తర్వాత ఫైనాన్స్ అండ్ స్ట్రాటజీలో ఎంబీఏ చేశాడు. తర్వాత అడ్వాన్స్‌‌డ్ టెలి మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌‌ స్థాపించి.. జేబీఎల్​, సెన్‌‌హైజర్‌‌ లాంటి బ్రాండ్లతో కలిసి పని చేశాడు. హర్మాన్ ఇంటర్నేషనల్‌‌లో సేల్స్ డైరెక్టర్‌‌గా పనిచేశాడు. ఇలా.. బిజినెస్​కు కావాల్సిన అనుభవం సాధించాక సమీర్‌‌తో కలిసి బోట్‌‌ను స్థాపించాడు. సమీర్ మెహతా ఆయన ముంబైలోని సెయింట్ జేవియర్ స్కూల్‌‌లో చదువుకున్నాడు. నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్​లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. రెడ్‌‌వుడ్ ఇంటరాక్టివ్‌‌లో పనిచేశాడు. అది కంప్యూటర్ గేమింగ్ హార్డ్‌‌వేర్​కి సంబంధించింది. 

ఆన్​లైన్​ మార్కెట్​

జియో ఎంట్రీ తర్వాత ఆన్​లైన్​ మార్కెట్ బాగా పెరిగింది. అంతెందుకు మొబైల్​ యాక్సెసరీస్​ అమ్మేవాళ్లు కూడా ఆన్​లైన్​లో ఆర్డర్​ పెట్టుకుని తమ కస్టమర్లకు అమ్మేవాళ్లు. దీన్ని కూడా బోట్ తనకు అనుకూలంగా మార్చుకుంది. ఆఫ్​లైన్​ అమ్మడం వల్ల పెరిగే కొన్ని ఖర్చులను తగ్గించుకుని, కేవలం ఆన్​లైన్​లోనే ప్రొడక్ట్స్​ని అమ్మింది. మొదటి మూడేండ్లు బోట్ ప్రొడక్ట్స్​ ఆఫ్​లైన్​లో దొరకలేదు. ముఖ్యంగా అమెజాన్, ​ఫ్లిప్​కార్ట్, మింత్ర, క్రోమా, జబాంగ్​లో అమ్మింది. ఇప్పుడు అధికారిక వెబ్‌‌సైట్‌‌లో కూడా రిటైలింగ్ మొదలుపెట్టింది. 

మార్కెటింగ్​

ఏ బిజినెస్​లో అయినా మార్కెటింగ్​ది ముఖ్య పాత్ర ఉంటుంది. బోట్​ సక్సెస్​కు కూడా మార్కెటింగ్​ ముఖ్య కారణం. కొత్తగా ఆలోచించి ప్రింట్​, టీవీల్లో కాకుండా ఎక్కువగా సోషల్​ మీడియాలోనే బ్రాండ్​ని ప్రమోట్​ చేయించింది. తర్వాత సెలబ్రిటీ, ఇన్‌‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మొదలుపెట్టింది. అంటే ఇండియాలోని ప్రముఖులు, క్రికెటర్లను బ్రాండ్​ అంబాసిడర్లుగా నియమించింది. తర్వాత ‘బోట్​ హెడ్స్​’ అనే క్యాంపెయిన్​ మొదలుపెట్టింది. బోట్​ ప్రొడక్ట్స్​ వాడేవాళ్లను, కంపెనీలో పనిచేసేవాళ్లను బోట్​ హెడ్స్​ అని పిలుస్తుంటారు. బోట్​ ప్రొడక్ట్స్​ కొన్నప్పుడు వాటితోపాటు ‘బోట్​ హెడ్స్​’ స్టిక్కర్​ని ఫ్రీగా ఇస్తారు. 

సక్సెస్​

ఒక కంపెనీకి సక్సెస్​ కావాలంటే.. ముఖ్యంగా కస్టమర్లు తమ దగ్గర్నించి ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని, వాళ్లకు కావాల్సినట్టుగా ప్రొడక్ట్​ని డిజైన్​ చేయగలగాలి. బోట్​ సరిగ్గా అదే చేసింది. కస్టమర్ల అవసరాలను గమనించి అందుకు తగ్గట్టుగా ప్రొడక్ట్స్​ని డిజైన్​ చేయించారు. కంపెనీ మొదటగా తీసుకొచ్చిన ఆపిల్ ఛార్జింగ్- కేబుల్ బాగా సక్సెస్​ అయ్యింది. తర్వాత ఇయర్‌‌ఫోన్స్​ తీసుకొచ్చారు. ఇండియాలో ఎక్కువమంది బేస్​ని ఇష్టపడతారు. అందుకే కంపెనీ తీసుకొచ్చిన మొదటి ఇయర్‌‌ఫోన్‌‌లకు ‘బేస్​ హెడ్స్’ అని పేరు పెట్టింది. పైగా వాటిలో బేస్​ బాగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది. తర్వాత 2018లో బోట్​ స్పీకర్లు, 2019లో సౌండ్‌‌బార్లు, హోమ్-ఆడియో సిస్టమ్​ని తీసుకొచ్చింది. 

లైఫ్​స్టైల్​ బ్రాండ్​

బోట్​ తీసుకొచ్చేవి అన్నీ ఎలక్ట్రానిక్స్​ వస్తువులే అయినా.. కంపెనీ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ కాదని లైఫ్​ స్టైల్ బ్రాండ్ అని చెప్పుకుంటుంది. ఈ స్ట్రాటజీ 2019లో ముంబైలో జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌‌లో మొదలుపెట్టింది. ఒక వస్తువుని ఎలక్ట్రానిక్​ గాడ్జెట్​గా ప్రమోట్​ చేస్తే కొనేవాళ్లకంటే వేరబుల్​ గాడ్జెట్​గా ప్రమోట్​ చేస్తే ఎక్కువమంది కొంటారు. అందుకే లైఫ్ స్టైల్​ బ్రాండ్​గా ప్రమోట్​ చేసుకుంది. మోడల్స్​ బోట్ ప్రొడక్ట్స్​ని వేసుకుని ర్యాంప్‌‌పై నడవడంతో ప్రొడక్ట్స్​కి మార్కెట్​లో మంచి క్రేజ్​ వచ్చింది. యువతని ఆకర్షించడమే కంపెనీ మెయిన్​ టార్గెట్. అందుకే వాళ్లనే లక్ష్యంగా చేసుకుని మార్కెటింగ్​ చేస్తుంటుంది. వాస్తవానికి కంపెనీ తీసుకొచ్చే ప్రొడక్ట్స్​ కూడా యూత్​కి సరిపోయేలా ఉంటాయి.  

సరైన టైం

ఎలాంటి ప్రొడక్ట్స్​, స్ట్రాటజీలతో వచ్చామనేది మాత్రమే కాదు... ఏ టైంలో మార్కెట్​లోకి ఎంట్రీ ఇచ్చామన్నది కూడా ముఖ్యమే. ఒక కంపెనీ ఉత్పత్తి చేసే ప్రొడక్ట్స్​కి డిమాండ్​ లేని టైంలో కంపెనీ పెడితే అన్నీ నష్టాలే వస్తాయి. అందుకే బోట్​ సరైన టైం చూసి మార్కెట్​లోకి వచ్చింది. 2016లో మొబైల్స్, ల్యాప్‌‌టాప్‌‌లు లాంటి టెక్ గాడ్జెట్లు వాడేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. అందుకు ముఖ్య కారణం టెలికం రంగంలోకి జియో ఎంట్రీ ఇవ్వడమే. జియో రాకతో డేటా ఛార్జీలు బాగా తగ్గిపోయాయి. దాంతో గాడ్జెట్ల వాడకం పెరిగింది. యూట్యూబ్​ లాంటి స్ట్రీమింగ్​ ఫ్లాట్​ఫామ్స్​ బాగా డెవలప్​ అయ్యాయి. వీడియోలు చూసేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. దాంతో ఇయర్​ఫోన్లకు డిమాండ్​ పెరిగింది. అందుకే ఆపిల్ కంపెనీ కూడా అదే సంవత్సరంలో తన మొదటి ఎయిర్‌‌పాడ్‌‌లను తీసుకొచ్చింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. అప్పటివరకు దాదాపు అన్ని మొబైల్​ ఫోన్​ బ్రాండ్లు ఫోన్​ కొంటే ఇయర్​ఫోన్లను ఉచితంగా ఇచ్చేవి. కానీ.. 2016 నుంచి ఇవ్వడం మానేశాయి. దాంతో ఫోన్​ కొన్నవాళ్లు ఇయర్​ ఫోన్లు సెపరేట్​గా కొనుక్కోవాల్సి వచ్చింది. ఇవన్నీ బోట్​ కంపెనీకి కలిసొచ్చాయి. అందుకే 30 లక్షల పెట్టుబడితో మొదలైన కంపెనీ రెండేండ్లలోనే 100 కోట్ల రూపాయలు సంపాదించింది. 

ఓపికతో.. 

అమన్​, సమీర్​లకు 2014లోనే ‘బోట్’ ఆలోచన వచ్చింది. కానీ.. రెండేళ్లపాటు మార్కెట్ రీసెర్చ్​, ప్రొడక్ట్స్​ సెలక్షన్​ కోసం పనిచేశారు. తర్వాత కంపెనీ మొదలుపెట్టాలని డిసైడ్​ అయినా అందుకు సరిపోయేంత డబ్బు లేదు. మొదట్లో లోన్​ ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాలేదు. అయినా పట్టువదలకుండా ప్రయత్నాలు చేశారు. చివరికి అనుకున్నది సాధించారు.  

ఫ్యూచర్​ ప్లాన్​ 

ఆడియో గాడ్జెట్లకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ భవిష్యత్తులో కంపెనీలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇండియాలో కొన్ని కంపెనీలు ఆడియో గాడ్జెట్లను మార్కెట్​లోకి తీసుకొస్తున్నాయి. అందుకే పెద్ద కంపెనీలు పోన్లు తయారు చేసే కంపెనీలతో పార్ట్​నర్స్​ అయ్యాయి. ఉదాహరణకు.. శామ్‌‌సంగ్‌‌తో హర్మాన్, జెబిఎల్,  హువావేతో సెన్‌‌హైజర్​ పార్ట్​నర్స్​గా ఉన్నాయి. కాబట్టి ఈ పోటీని తట్టుకుని కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు భవిష్యత్తులో బోట్ బండిల్​ ఆఫర్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.