ఖతమయ్యేది బీజేపీ కాదు.. బీఆర్ఎస్.. కవిత టంగ్ స్లిప్ అయినట్టుంది: రాంచందర్ రావు

ఖతమయ్యేది బీజేపీ కాదు.. బీఆర్ఎస్.. కవిత టంగ్ స్లిప్ అయినట్టుంది: రాంచందర్ రావు
  • ఆమె ఓడిపోయింది మా ఎంపీ చేతిలోనేనని గుర్తుంచుకుంటే మంచిది
  • బీజేపీ స్టేట్ ఆఫీసులో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి
     

హైదరాబాద్, వెలుగు: కవిత కొత్త పార్టీ పెడితే.. భూస్థాపితమయ్యేది బీఆర్ఎస్ పార్టీయేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. కవిత టంగ్ స్లిప్ అయినట్టుందని ఆయన పేర్కొన్నారు. తమ కొత్త పార్టీ వల్ల బీజేపీ కనుమరుగవుతుందన్న కవిత వ్యాఖ్యలకు ఆయన కౌంటర్​ఇచ్చారు. కవిత ఏ పార్టీ చేతిలో ఓడిపోయారో గుర్తుచేసుకోవాలని ఆయన సూచించారు.

ఆమెను ఓడించిన బీజేపీ ఎంపీ అర్వింద్ తన పక్కనే ఉన్నారని చెప్పారు. జాగృతిని పార్టీగా మారిస్తే బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదని,  అసలు బీఆర్ఎస్ పార్టీనే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. గురువారం నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో కలిసి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ మహరాజ్ కేవలం ఒక ప్రాంతానికి, మతానికి చెందిన వాడు కాదని, ఆయన యావత్ భారత దేశానికి ఆదర్శప్రాయుడని కొనియాడారు. మొఘలాయిల అణచివేతను ఎదురొడ్డి, ఔరంగజేబు వంటి క్రూర పాలకులను ఎదిరించి హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరుడని వివరించారు. దేశవ్యాప్తంగా యువత శివాజీని స్ఫూర్తిగా తీసుకుంటున్నారని అన్నారు. శివాజీ మహరాజ్ కేవలం యుద్ధ వీరుడు మాత్రమే కాదని, గొప్ప పరిపాలనా దక్షుడని రాంచందర్ రావు గుర్తుచేశారు.

 ఆయన హయాంలో ప్రవేశపెట్టిన రెవెన్యూ వ్యవస్థ, వ్యవసాయ సంస్కరణలు, సాగునీటి విధానాలు నేటికీ ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, ధర్మబద్ధమైన పాలన అందించారని చెప్పారు. శివాజీని ఏ ఒక్క కులానికో, మతానికో ఆపాదించడం సరికాదని, ఆయన దేశభక్తిని ప్రతి భారతీయుడు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.