మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది. తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్, శుభ్‌మన్ గిల్ లాంటి అరంగేట్ర ఆటగాళ్లు మంచి ప్రదర్శన కనబర్చారు. సెంచరీ కొట్టిన అజింక్యా రహానె.. బ్యాట్స్‌మన్‌గానే కాక సారథిగానూ ఆకట్టుకున్నాడు. వీరితోపాటు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. స్టీవ్ స్మిత్ లాంటి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో అశ్విన్ సఫలం అయ్యాడు. దీనిపై స్టీవ్ స్మిత్ స్పందించాడు. అశ్విన్‌ను ఒత్తిడిలోకి నెట్టకపోవడంతో అతడు తనపై విజృంభించేందుకు అవకాశం కల్పించానని స్మిత్ చెప్పాడు.
‘నేను అనుకున్న విధంగా అశ్విన్ బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయా. అతడిపై మరింత ఒత్తిడి పెట్టాలని నేను భావించా. కానీ విఫలమయ్యా. దీంతో నాపై విజృంభించేందుకు అతడికి చాన్స్ ఇచ్చా. ఇప్పటివరకు నా కెరీర్‌లో ఏ స్పిన్నర్‌కూ ఇలా అవకాశం ఇవ్వలేదు. ఎప్పుడూ స్పిన్నర్లపై చెలరేగేవాడ్ని. తర్వాతి మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్‌ను దూకుడుగా ఎదుర్కొంటా. క్రీజులో ఎక్కువ సేపు గడపడం పైనే ప్రస్తుతం దృష్టి పెట్టా. రిథమ్‌ను అందిపుచ్చుకుంటే బాగుంటుంది’ అని స్మిత్ పేర్కొన్నాడు.

